జై మల్లన్న.. జైజై భ్రమరాంబ! | - | Sakshi
Sakshi News home page

జై మల్లన్న.. జైజై భ్రమరాంబ!

Mar 15 2026 4:57 AM | Updated on Mar 15 2026 4:57 AM

ఆడపడుచు దర్శనానికి

తరలివస్తున్న కన్నడిగులు

నల్లమల మీదుగా

శ్రీగిరి వైపు అడుగులు

ఆత్మకూరు: శ్రీశైలం మహాక్షేత్రంలో వెలిసిన శ్రీభ్రమరాంబదేవి కన్నడిగులకు ఆడపడుచుగా కొలువుదీరి ఉందని భక్తుల విశ్వాసం. ఉగాది ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా సంప్రదాయం కొనసాగుతోంది. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం శివభక్తురాలైన భ్రమరాంబ కర్ణాటక ప్రాంతానికి చెందినవారని స్వప్నంలో సాక్షాత్కరించిన పరమేశ్వరుడ్ని వరించారు. శివుడు ఓ భ్రమరాన్ని (తుమ్మెదను) చూపించి, అది నిలిచిన చోటుకు వస్తే తానే వరిస్తానని స్వప్నంలో చెప్పడంతో అమ్మవారు భ్రమరాన్ని అనుసరించారు. ఆ తుమ్మెద శ్రీశైలం వద్ద ఆగింది. అక్కడికి వృద్ధ రూపంలో ఉన్న పరమేశ్వరుడు వచ్చి.. స్వప్నంలో కనిపించింది తానేనని చెప్పడంతో అమ్మవారు వివాహమాడారు. అందుకే శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. కన్నడిగురాలైన భ్రమరాంబదేవిని మల్లికార్జున స్వామి వరించడంతో కన్నడిగులు అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించి ఏటా శ్రీశైలానికి సారె తెస్తారు. వందల కి.మీ. దూరం నుంచి శ్రీశైలం మహాక్షేత్రానికి కన్నడ సంప్రదాయరీతిలో మిరియాలపట్టు, ముత్తైదు సౌభాగ్యాలతో కావాల్సిన గాజులు, పసుపు, కుంకుమలు, నూతన పట్టుచీరలు, రవికెలు, కొత్త చాటతో అమ్మవారికి చీర, సారె మహిళల నెత్తిపై పెట్టుకుని తమ ఆడపడుచు శ్రీభ్రమరాంబదేవి సమర్పిస్తారు. అమ్మవారికి మొక్కులు తీర్చి తమ కుటుంబాన్ని చల్లగా చూడమని వేడుకుంటారు.

వందల కి.మీ పాదయాత్రగా..

ఉత్సవాలకు దాదాపు 20 రోజుల ముందుగానే కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. బళ్లారి, రాయచూరు, గుల్బర్గా, సోలాపూర్‌, బెంగళూరు, హుబ్లీ తదితర ప్రాంతాల నుంచి వందల కి.మీ నడుస్తూ శ్రీశైలం మహాక్షేత్రానికి పాదయాత్రగా వస్తున్నారు. ఆత్మకూరు సమీపంలో వెంకటాపురం నుంచి నల్లమల మీదుగా అటవీ మార్గంలో రాత్రి సైతం టార్చ్‌లైట్ల వెలుతురులో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. నాగలూటి వద్ద వీరభద్రుడికి మొక్కులు చెల్లించి మెట్ల మార్గంలో నడక మొదలు పెడుతున్నారు. నాగలూటి వద్ద మహారాష్ట్ర బృందం చేపట్టిన అన్నదానంతో ఆకలి తీర్చుకుని శ్రీగిరి వైపు అడుగులు వేస్తున్నారు. కై లాస ద్వారం చేరుకుని వడివడిగా శ్రీగి చేరి భ్రమరాంబకు జై.. మల్లన్నకు జై అంటూ నినదిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement