విద్యాలయంలో ఉన్మాది విలయం | - | Sakshi
Sakshi News home page

విద్యాలయంలో ఉన్మాది విలయం

Mar 9 2026 7:35 AM | Updated on Mar 9 2026 7:35 AM

కత్తి, రాడ్‌తో హాస్టల్లో

9వ తరగతి విద్యార్థి దాడులు

సమ్మతగేరి విద్యార్థి మృతి,

8 మందికి తీవ్రగాయాలు

సాక్షి, బళ్లారి/ హొళగుంద: అక్షరాలు నేర్పే చదువుల తల్లి ఒడిలో రక్తపాతం సంభవించింది. రోజూ మాదిరిగానే భోజనం చేసి నిద్రిస్తున్న సహచర విద్యార్థులపై మరో విద్యార్థి రాక్షసునిలా మారి దాడికి తెగబడ్డాడు. బళ్లారి శివార్లలోని గురుకుల స్కూల్‌ ఇంటర్నేషనల్‌ అనే ఓ ప్రైవేటు స్కూలు హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి శనివారం రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్యలో ఉన్మాదిగా కత్తి, రాడ్డులో సహచర విద్యార్థులపై దాడి చేశాడు. కర్నూలు జిల్లా హొళగుంద మండల పరిధిలోని సమ్మతగేరి గ్రామానికి చెందిన హేమంత్‌ (15) అనే 9వ తరగతి విద్యార్థిని బెడ్డు మీదే పొడిచి, రాడ్డుతో కొట్టి చంపాడు. మోక్షిత్‌, హేమంత్‌, వినయ్‌, విష్ణు, భానుప్రసాద్‌, మనోజ్‌ అనే విద్యార్థులు, శశికళ అనే విద్యార్థినికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఆకస్మికంగా జరిగిన ఈ ఘోరంతో హాస్టల్‌ రక్తసిక్తమైంది. టీచర్‌ బ్లెస్సీ, ఓ హాస్టల్‌ ఉద్యోగి కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన విద్యార్థులను స్థానిక బిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి, న్యాయవాది బి.లక్ష్మీకాంత్‌ దంపతులు, బంధువులు, మిగతా విద్యార్థుల బంధువులు పరుగు పరుగున వచ్చారు. ఆదివారం ఉదయం బిమ్స్‌ ఆస్పత్రి పోస్టుమార్టం వద్ద విషాదం నెలకొంది. బాధితుల తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరి కన్నీరుమున్నీరుగా విలపించారు. బళ్లారి జిల్లా ఎస్పీ సుమన్‌ పన్నేకర్‌, డీఎస్‌పీ, సీఐలు తదితరులు బందోబస్తు కల్పించారు.

చంపే అవసరం ఏముంది?

విద్యార్థి తండ్రి లక్ష్మీకాంత్‌ విలేకరులతో మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో తన కుమారుడు హత్యకు గురయ్యాడన్నారు. భరత్‌ అనే విద్యార్థి దాడి కత్తితో పొడిచి చంపాడని విలపించారు. తన కుమారునికి ఎలాంటి గొడవ పడే మనస్తత్వం కాదని, అందరితో కలిసిమెలిసి ఉంటాడని, రాడ్‌, చాకుతో దాడి చేయాల్సిన అవసరం ఏముందో అర్థం కావడం లేదన్నారు. తమ కుమారుడుని హత్య చేసిన విద్యార్థిని కఠినంగా శిక్షించాలని తల్లి, బంధువులు డిమాండ్‌ చేశారు. పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత విద్యార్థి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్తూ ఎంత ఘోరం జరిగిపోయిందని రోదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement