జూపాడుబంగ్లా: ఆయిల్‌పామ్ సాగు చేపట్టడం ద్వారా రైతులు తక్కువ శ్రమతో అధిక లాభాలు ఆర్జించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఆదినారాయణ, నందికొట్కూరు ఉద్యాన అధికారిణి తేజశ్విని సూచించారు. శుక్రవారం మండలంలోని మండ్లెం రైతు సేవా కేంద్రంలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. మార్కెటింగ్ సౌకర్యం కోసం ప్రభు త్వం ఇప్పటికే పతంజలి, ఎంఎంఈఓ ఓపీ కంపెనీలతో ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఈ పథకం కింద ఎకరాకు 57 మొక్కలు ఇవ్వడంతో పాటు హెక్టారుకు రూ. 10,500 ఎరువుల కోసం అందజేస్తామని వివరించారు. సాగు చేసిన నాలుగేళ్ల నుంచి ఏటా ఎకరాకు రూ. 1.50 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో త్రీఎఫ్ కంపెనీ జోనల్ మేనేజర్ మోహన్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.


