● కోట్ల, సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య
విభేదాలు
● డోన్ నియోజకవర్గ ప్రజలకు
తొలగని కష్టాలు
డోన్: ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన టీడీపీ నేతలు ఆధిపత్యం కోసం కోట్లాడుతున్నారు. దీంతో ఒక బ్రిడ్జి నిర్మాణ పనులకు ఇంతవరకు తీర్మానం రాలేదు. డోన్ రూరల్ పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న 44వ జాతీయ రహదారికి సమాంతరంగా సాయిబాబు గుడికి సర్వీసు రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభం అయ్యే సూచనలు కనిపించటం లేదు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. సాయిబాబా మందిర ప్రథమ వార్షికోత్సవానికి వచ్చి బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.20కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆలయ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిల వర్గీయుల మధ్య విభేదాలు తలెత్తి బ్రిడ్జి నిర్మాణ పనులు ముందుకు సాగేందుకు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో ఉడుములపాడు గ్రామ పంచాయతీలో బ్రిడ్జి నిర్మాణం పనుల ఆమోదం కోసం పెట్టిన తీర్మానం చేయకుండా ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకుంటునారని ధర్మవరం వర్గీయులు ఆరోపిస్తున్నారు. సాయిబాబా ఆలయానికి నిత్యం వచ్చే భక్తులతో పాటు ఉడుములపాడు వైపు వేళ్లే వాహన దారులు, పాదచారులకు 44వ జాతీయ రహదారికి సర్వీస్ రోడ్లులా ఉపయోగపడేందుకు ఈ బ్రిడ్జి ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. అయితే ధర్మవరం వర్గీయులు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే వర్గీయులు కొట్టిపడేస్తున్నారు. ప్రజలకు ఉపయోగ పడే పనుల ప్రాధాన్యత గురించి ధర్మవరం వర్గీయుల కంటే తమకే బాగా తేలుసని కోట్ల వర్గీయులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా శాశ్వతమైన పనులు చేయలేదు. టీడీపీ నాయకులు ఆధిపత్యం కోసం కాంట్రాక్టుల ద్వారా అక్రమ సంపాదన ధ్యేయంగా పనిచేస్తునారని కోట్ల, ధర్మవరం వర్గీయులపై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


