● ఆర్టీసీ ఈడీ దృష్టికి ప్రధాన సమస్య
పత్తికొండ: సాయంత్రం ఆరు గంటలు దాటితే కర్నూలు, గుంతకల్, ఆదోని, గుత్తి లాంటి ప్రాంతాలకు వెళ్లడానికి బస్సులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఏపీఎస్‌ఆర్‌టీసీ కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ దృష్టికి ప్రయాణికులు తీసుకెళ్లారు. ప్రతిరోజు ఆదోని, గుంతకల్ రూట్‌లలో బస్సులు సంఖ్య తక్కువ ఉన్నందున గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్‌ను రిజినల్ మేనేజర్ శ్రీనివాసులతో కలసి ఈడీ తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉచిత బస్సు పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం రద్దీ ఏర్పడిందన్నారు. రద్దీ నివారణకు ప్రతి డిపోలో నూతనంగా బస్సుల సంఖ్యను పెంచి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. ఈడీ వెంట పత్తికొండ డిపో ఇన్‌చార్జ్ మేనేజర్ నాగభూపాల్, ఆర్టీసీ సిబ్బంది శేఖర్, మల్లప్ప, కృష్ణమూర్తి, లక్ష్మణ్‌నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు.


