‘అలగనూరు’ పనులను పూర్తి చేయండి
అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్‌పై ఆదివారం సీపీఐ, ఏపీ రైతు సంఘం నేతలు జిల్లా పరిషత్‌లోకి దూసుకువచ్చారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతున్న దృష్ట్యా తమ డిమాండ్‌ను అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని వారు జెడ్పీ గేట్లు దాటుకొని వచ్చి సమావేశం భవనం ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు బైఠాయించారు. అలగనూరు రిజర్వాయర్ మరమ్మతుల కోసం రూ.33 కోట్లను విడుదల చేసి పనులు పూర్తి చేస్తామని జెడ్పీ సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
మళ్లీ అవే తప్పులు
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే రామాంజనేయులు, నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ.. నందికొట్కూరు నియోజకవర్గం మిడ్తూరు మండలంలో తుంగభద్ర జలాశయం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టు నీరుకు 1985లో 2.5 టీఎంసీల సామర్థ్యంతో 1999లో పనులు ప్రారంభించి 2002లో పూర్తి చేశారన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 2017లో అధిక వర్షాలతో గండి పడిందన్నారు. అప్పట్లో రూ.3 కోట్లు ఖర్చు చేసి ఉంటే పనులు పూర్తి అయ్యేవన్నారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నాడు చేసిన తప్పులనే మళ్లీ చేస్తోందన్నారు. ఫలితంగా అలగనూరు రిజర్వాయర్ ద్వారా వచ్చే నీటిని కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు వినియోగించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
రైతుల సమస్యలను
పట్టించుకోని మంత్రులు
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రైతుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సీపీఐ నాయకులు ఆరోపించారు. అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులకు నిధులను విడుదల చేసి వెంటనే పనులను పూర్తి చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫకృద్దీన్, నగర కార్యదర్శి రామక్రిష్ణారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్‌బాబు, నాయకులు రఘురాం, భార్గవ, మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రావణి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కే శ్రీనివాసులు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల సుబ్బారెడ్డి, జీ సోమన్న, జిల్లా సమితి సభ్యులు డీ శ్రీనివాసులు, నందికొట్కూరు శ్రీనివాసులు, నరసింహులు, నారాయణ, ప్రతాప్ పాల్గొన్నారు.


