మిరప రైతులను ‘నల్లి’పేసింది!
● తెగుళ్లతో మిరప రైతు కుదేలు
● స్పందించని చంద్రబాబు ప్రభుత్వం
నందవరం: నల్లి.. మిరప రైతును నట్టేట నలిపేసింది. రైతు కంట్లో కారం కొట్టి కోలుకోలేని దెబ్బ తీసింది. పైర్లను పిప్పి జేసి తీరని నష్టాన్ని మిగిల్చింది. చేతికి పంట రాకుండా రైతన్న ఆశలను శిథిలం చేసింది. ఎన్ని మందులు కొట్టినా మాయదారి నల్లి(తామర కీటకం) మాత్రం చావలేదు. రైతన్నలను పీల్చి పిప్పిజేసేసి కన్నీళ్లు పెట్టించింది. నల్లితో నట్టేట మునిగినా చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. అరకొర దిగుబడులను అమ్ముకుందామన్నా ధరలు లేక రైతులకు నష్టాలు వచ్చాయి.
5 వేల ఎకరాల్లో మిరప
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 5,010 ఎకరాల్లో మిరప సాగైంది. తేజ (సన్న సైజు), డీలక్స్ రకాలు సాగు చేస్తున్నారు. మిరప సాగు ఖర్చు అధికంగా ఉండడంతో ఈ ఏడాది 5,010 వేల ఎకరాల్లో మిరప సాగైంది. నందవరం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాల్లో మిరప వేశారు. తామర, నల్లి, జెమిని తదితర తెగుళ్లతో మిరప పంటలు తీవ్రంగా దెబ్బతీన్నాయి. ఓ పక్క తెగుళ్లు..మరో పక్క అధిక వర్షాలతో మొదటిలోనే మిరప పంటలు తీవ్రంగా నాశమయాయి. దిగుబడులు భారీగా తగ్గడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
నల్ల తామర బెడద
నల్లతామర మిరప రైతులను పీడిస్తూనే ఉంది. పూతంతా నేలరాలిపోతుంది. ఒకవేళ అరకొర పూత మిగిలినా కాయ సైజు మజ్జుగా మారిపోతుంది. కారణంగా దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. ఆరోగ్యకర పైరు ఉంటే ఎకరాకు 50 క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది. ఈ నల్లతామర సోకి ఎకరాకు 4–5 క్వింటాల్ మించి పంట రాదు. ఈసారి తామర ప్రభావం మరింతగా పెరిగింది. ఇప్పటికే 60 శాతం పైర్లన్నీ పాడుబోయాయి. కొందరు రైతులు పంటను వదిలేసుకున్నారు.
చోద్యం చూస్తూ..
ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి పెడితే ప్రస్తుతం రూ.60 వేలకు మించి చేతికందలేదని వేలాది మంది రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎరువుల ధర బస్తాపై రూ.100–200 పెంచడంతో పెట్టుబడి భారం మరింతగా పెరిగిపోయింది. రైతులు ఎంతగానో అల్లాడి పోతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదు. రైతులను గట్టెక్కించే చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తోంది.
ఒక ఎకరాలో దేవనూర్ డీలక్స్ రకం మిరప వేశాను. పంట ఎదుగుతున్న తరుణంలో నల్లతామర సోకింది. ఇప్పటి వరకు రూ.1.20 లక్షలు ఖర్చు చేశాను. నల్లి కారణంగా ఎకరాకుగానూ 2 క్వింటాళ్ల వరకు రావొచ్చు.
– పెద్ద నాగేంద్ర, జొహరాపురం
ఈ మధ్య నల్లతామర ప్రభావం పెరిగిపోయింది . దీనిని పూర్తిగా సంహరించడం అసాధ్యం. తామరను నుంచి పంటల రక్షించుకోవడానికి పైరు చుట్టూరా బార్డర్ క్రాప్ వేసుకోవాలి. నల్లి కారణంగా పంటలు దిగుబడులు దాదాపు తగ్గిపోయాయి.
– శ్రీవాణి, వ్యవసాయాధికారిణి, నందవరం
మిరప రైతులను ‘నల్లి’పేసింది!


