సర్కారు నిర్లక్ష్యం..రైతుకు నష్టం!
కర్నూలు సిటీ: తుంగభద్ర జలాల్లో జిల్లా ఆయకట్టు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. వాస్తవంగా డ్యా గేట్ల మార్పునకు దిగువ కాలువ నీటి విడుదలకు ఎలాంటి సంబఽంధమే లేదు. అయినప్పటికి గేట్ల మార్పు పేరుతో డ్యాంలో ఉన్న నీటిని వృథాగా దిగువకు వదిలేశారు. ఫలితంగా ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే 1.5 లక్షల ఎకరాల పంటల సాగును రైతన్నలు కోల్పోవాల్సి వచ్చింది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా వర్షాలు రావడంతో తుంగభద్ర డ్యాంలో ఇన్‌ఫ్లో మొదలైంది. సీజన్ ప్రారంభం నాటికే డ్యాంలో నీటి నిల్వలు ఆశాజనకంగా చేరాయి. 2025–26 నీటి సంవత్సరంలో 415.16 టీఎంసీల నీరు డ్యాంలో చేరింది. 2024 ఆగస్టులో టీబీ డ్యాం గేటు కొట్టుకుపోవడం..ఆ తరువాత గేట్ల నిపుణులతో సలహాతో మొత్తం గేట్లు మార్చేందుకు నిర్ణయం తీసుకొని టెండర్లు సైతం ఖరారు చేశారు. నీటి నిల్వను 105.79 టీఎంసీల నుంచి 80 టీఎంసీల తగ్గించారు. డిసెంబరు నెలలో కూడా 80 టీఎంసీల నీరు ఉన్నప్పటికి గేట్ల పనుల సాకుతో డ్యాం నుంచి వృథాగా దిగువకు నీటిని విడుదల చేసి క్రస్ట్ లెవెల్ 1613 అడుగులకు నీటి మట్టాన్ని తీసుకొచ్చారు. ఈ నీటి మట్టాన్ని చూపి రబీకి నీరు ఇవ్వలేమని ఈ ఏడాది జనవరి 15 వరకు నీటిని విడుదల చేసి బంద్ చేశారు. గేట్ల మార్పునకు ఎల్‌ఎల్‌సీకి నీటి సరఫరా నిలిపివేతకు ఎలాంటి సంబఽంధం లేదు. రైతులకు తీవ్ర నష్టం కలిగించే దీనిపై చంద్రబాబు సర్కారు స్పందించకపోవడం లోలెవన్ కెనాల్‌లో మిగిలిపోయిన ఆధునికీకరణ పనులు చేసి బిల్లులు చేసుకునేందుకేనని ఇంజినీరింగ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
దిగువ రైతుకు మొండిచేయి
తుంగభద్ర దిగువ కాలువ కింద జిల్లాలో ఖరీఫ్, రబీలో 1.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రబీలో లక్ష ఎకరాలకు పైగా నీరు ఇవ్వాల్సి ఉంది. గతేడాది టీబీడ్యాం గేట్లు మార్చేందుకు ఖరీఫ్‌లో మాత్రమే సాగుకు నీరిస్తామని, రబీలో నీరివ్వమని టీబీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం రబీ ఆయకట్టుకు నీరు అవసరం లేదని ఇండెంట్ ఇవ్వలేదు. దీన్ని సాకు చూపించి ఏపీ ప్రభుత్వం కూడా ఎల్‌ఎల్‌సీ, కేసీ వాటా నీటికి ఇండెంట్ పెట్టకపోవడం గమనార్హం. టీబీ డ్యాంలో ఎల్‌ఎల్‌సీకి 4.7, కేసీకి 4.6 టీఎంసీల వాటాకు ఇండెంట్ పెట్టి ఉన్నట్‌లైతే ఆరుతడి పంటలైన పండించుకునేందుకు అవకాశం ఉండేది. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన 9.3 టీఎంసీల తుంగభద్ర జలాలను ఆయకట్టుదారులు కోల్పోయారు. ఫలితంగా 1.5 లక్షల ఎకరాలకుపైగా సాగును కోల్పోయి దాదాపు రూ.500 కోట్లకుపైగా ఆదాయాన్ని కోల్పోయారు. దీంతో పాటు ఎల్‌ఎల్‌సీ ఆధారిత, తుంగభద్ర నది తీరంలోని గ్రామాలు, తీరంలోని తాగు నీటి పథకాలకు నీరందని పరిస్థితులు రావడంతో వేసవిలో తాగు నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం గేట్ల మార్చేందుకు క్రస్ట్ లెవెల్ 1,613 అడుగులకు నీటి మట్టాన్ని తగ్గించేందుకు డిసెంబరు నెలలో నీటిని దిగువకు విడుదల చేశాం. క్రస్ట్ లెవెల్‌లో కూడా 43 టీఎంసీల నీరు ఉంటుంది. ఈ నీటిలోనే జనవరి 15 వరకు ఎల్‌ఎల్‌సీకి తాగు నీటి ట్యాంకులు నింపుకునేందుకు నీరు ఇచ్చాం. రబీలో సాగు నీరు వద్దని కర్ణాటక ప్రభుత్వం ఇండెంట్ పెట్టకపోవడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఇండెంట్ పెట్టలేదు. ఎల్‌ఎల్‌సీ ఆధునీకీకరణ పెండింగ్ పనులు జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– నారాయణ నాయక్, టీబీ డ్యాం ఎస్‌ఈ
డ్యామ్ గేట్ల మార్పు పేరుతో రబీకి
నీరు ఇవ్వలేమని ప్రకటించిన టీబీ బోర్డు
అవకాశం ఉన్నా ఏపీ వాటాకు
ఇండెంట్ ఇవ్వని చంద్రబాబు సర్కారు
బిల్లులు చేసుకునేందుకు ఇలా
వ్యవహరించిందనే విమర్శలు
రబీ ఆయకట్టును కోల్పోయిన రైతులు
ప్రస్తుతం డ్యాంలో 23 టీఎంసీల
నీటి నిల్వలు
ఎల్‌ఎల్‌సీ, తుంగభద్ర నది తీర
ఆధారిత తాగు నీటి పథకాలకు
పొంచి ఉన్న ముప్పు


