ఉమ్మడి కర్నూలు జిల్లాలో 43 చేనేత సహకార సంఘాలు ఉండగా.. నేడు ఏడు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో కూడా ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం మినహా మిగిలిన వాటి పనితీరు అంతంతమాత్రమే. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను ఆ సంఘమే మార్కెటింగ్ చేసుకుంటోంది. మిగిలిన సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాల మార్కెటింగ్‌కు ఆప్కోనే ఆధారం. రెండేళ్లుగా జిల్లాలోని చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే సంఘాలు యాక్టివ్‌గా పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే ఎన్నికలకు ప్రభుత్వం ఆసక్తి చూపని పరిస్థితి. రెండేళ్లుగా మంగళగిరిలోని ఆప్కో గోదాము నుంచి కొత్త సరుకు రాకపోవడంతో కర్నూలు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఆప్కో గోదాము మూతపడింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, శ్రీశైలంలలో ఆప్కో షోరూములు ఉన్నాయి. కొత్త సరుకు రాకపోగా ఉన్నది పాతబడిపోయింది. పాత సరుకు కొనేందుకు వినియోగదారులు ముందుకు రాకపోవడంతో మూటకట్టి మంగళగిరి గోదాముకు పంపుతున్నారు.


