నగరపాలక ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి | - | Sakshi
Sakshi News home page

నగరపాలక ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి

Mar 11 2026 7:34 AM | Updated on Mar 11 2026 7:34 AM

కర్నూలు(టౌన్‌): కర్నూలు నగరపాలక సంస్థ స్పెషల్‌ ఆఫీసర్‌గా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి నియమితులయ్యారు. ఈనెల 17న కర్నూలు నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగియనుంది. దీంతో ప్రభుత్వం కలెక్టర్‌ను నగరపాలక సంస్థకు ప్రత్యేక అధికారిగా నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ జీవో 284 జారీ చేశారు. అలాగే కర్నూలు కార్పొరేషన్‌లో కమిషనర్‌గా పనిచేస్తున్న పి.విశ్వనాథ్‌ను ప్రభుత్వం నందికొట్కూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు

కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు ఆర్‌ఐఓ జి.లాలెప్ప తెలిపారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 75 కేంద్రాల్లో ఫస్ట్‌ ఇయర్‌ ఫిజిక్స్‌ పరీక్షలు నిర్వహించగా 20,731 మంది విద్యార్థుల్లో 20,205 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఈ నెల 17న ఫస్ట్‌ ఇయర్‌, 18వ తేదీకి సెకండియర్‌ పరీక్షలు ముగియనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మూల్యాంకనం ప్రారంభమైంది. ప్రస్తుతం సంస్కృతం సబ్జెక్టు మూల్యాంకనం కొనసాగుతోంది. 20వ తేదీ తరువాత ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభం కానున్నట్లు ఇంట ర్మీడియెట్‌ బోర్డు వర్గాలు తెలిపాయి.

భక్తుల క్షేమమే ప్రధాన లక్ష్యం

కర్నూలు(టౌన్‌): భక్తుల క్షేమమే ప్రధాన లక్ష్యమ ని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపా రు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కర్నూలు జిల్లా మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తుల వాహనాలు ఓవర్‌లోడ్‌తో ప్రయాణించకూడదన్నారు. అలాగే సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదన్నారు. వాహనాల్లో వంట గ్యాస్‌ సిలిండర్లు రవాణా చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రయాణ సమయంలో ఎక్కడైనా సమస్యలు తలెత్తినా, లేదా రోడ్డు ప్రమాదాలు జరిగినా వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

14న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి నోట్‌ ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో నిర్వహిస్తామన్నారు. సమావేశాల్లో షెడ్యూల్‌ ప్రకారం గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య మరియు వైద్యం, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, పను లు – ఆర్థిక ప్రణాళిక అంశాలపై సమీక్ష కొనసాగుతుందన్నారు. సమావేశాలకు కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన సంబంధిత స్థాయీ సంఘాల సభ్యులు, అధికారులు తమ కు కేటాయించిన సమయానికి తప్పక హాజరు కావాలని సీఈఓ కోరారు.

మైనారిటీ బాలికల గురుకులంలో ప్రవేశాలు

కర్నూలు(అర్బన్‌): పంచలింగాల గ్రామంలోని ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో 80 సీట్లు, 6వ తరగతిలో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశానికి అర్హులైన మైనారిటీ బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ భారతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన వారు ఈ నెల 31లోగా https://aprs.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్‌ 24న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. వివరాలకు 8712625070 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement