ఆలూరు రూరల్: శాసన మండలి చైర్మన్ హిందూవు కాదని క్రిస్టియన్ అంటూ రాష్ట్ర మంత్రి అచ్చెం నాయుడు మండలి చైర్మన్ మోషన్ రాజును అనడం దారుణమని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఖండించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయాల కోసం పవిత్రమైన వెంకన్న స్వామి లడ్డూను వాడుకున్నారని, లడ్డు కల్తీపై చర్చ జరగాలంటూ శాసన మండలిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు పట్టుబడుతుంటే చర్చకు రాకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేసి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. మండలి చైర్మన్ హిందువు కాదని క్రిస్టియన్ అని కులం పేరుతో దూషించడం దుర్మార్గమన్నారు. మంత్రి హోదాలో ఉండి మండలి చైర్మన్‌పై దురహంకార వ్యాఖ్యలు చేసిన అచ్చెం నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వడ్డీ మాఫీని సద్వినియోగం చేసుకోండి
కర్నూలు(అర్బన్): జిల్లాలో ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేడీసీ పథకాల ద్వారా 2015–16 నుంచి 2018 –19 వరకు స్వయం ఉపాధి పథకాల ఏర్పాటుకు రుణాలు తీసుకున్న ఎస్సీ లబ్ధిదారులకు వడ్డీ మాఫీ వర్తింపజేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.తులసీదేవి తెలిపారు. బుధవారం ఆమె తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ రెండు పథకాలకు సంబంధించి 2025 డిసెంబర్ 31వ తేది నాటికి బకాయి పడిన వడ్డీ రూ.2,41,96,643 ఉందన్నారు. ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు నాటికి అసలు చెల్లిస్తే వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం కింద 965 మంది లబ్ధిదారులకు రూ.2,30,64,729, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకానికి సంబంధించి 72 మంది లబ్ధిదారులకు రూ.11,31,914 మాఫీ చేయడం జరుగుతుందన్నారు. వడ్డీ మాఫీ ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పలువురు లబ్ధిదారులు రూ.35 లక్షల వరకు చెల్లించారన్నారు.
ఇంటర్ పరీక్షలకు 259 మంది గైర్హాజరు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షలకు బుధవారం 259 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు 16,596 మంది విద్యార్థుల్లో 16,337 మంది హాజరైనట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప తెలిపారు.
తేనె ఉత్పత్తితో అదనపు ఆదాయం
ఎమ్మిగనూరు సెంట్రల్: తేనె టీగలు పెంచుతూ తేనె ఉత్పత్తి చేయడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఎం.జాన్సన్, కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డా. రాఘవేంద్ర చౌదరి పేర్కొన్నారు. బనవాసి కేవీకేలో గత కొన్ని రోజులుగా తేనేటీగల పెంపకంపై ఇస్తున్న శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. శిక్షణకు హాజరైన 30 మంది రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేనెటీగల పెంపకం ద్వారా నూనెగింజల పంటలలో పరాగసంపర్కం మెరుగుపడి ఉత్పాదక గణనీయంగా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు అశోక్‌కుమార్, రవిప్రకాష్‌రెడ్డి, సుజాతమ్మ, ట్రైనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


