కృష్ణగిరి: మండలంలో అధికంగా ఉన్న బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణలు వెంటనే అరికట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కర్, ఐసీడీఎస్ పీడీ విజయ, ఆదోని ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ అజయ్‌కుమార్, పత్తికొండ ఇన్‌చార్జి ఆర్డీఓ కొండయ్యలను ఆదేశించారు. బుధవారం ఆమె కృష్ణగిరి మండలంలోని పీహెచ్‌సీ, తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పీహెచ్‌సీ రికార్డులు పరిశీలించి, వైద్యులతో సమావేశమై ఆసుపత్రిలో ప్రసవాల శాతం పెంచాలని సూచించారు. మండలంలో ఎక్కువగా నమోదవుతున్న సీజనల్ వ్యాధులు డెంగీ, మలేరియా నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కార్యక్రమాన్ని పరిశీలించి వయోజనులైన అభ్యాసకులతో మాట్లాడి చదువులో పురోగతిని పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట సీడీపీఓ ల్యూక్, పీహెచ్‌సీ వైద్యాధికారి సురేశ్ కుమార్, ఎంపీడీఓ మోహన్ కుమార్, ఏపీఎం మహేశ్వరయ్య ఉన్నారు.


