హొళగుంద: మండల కేంద్రం హొళగుందలో బుధవారం కామన్న (మన్మథ) వేడుకల ముగింపులో భాగంగా జరిగిన హాస్య కార్యక్రమాలు ప్రజలను కడుపుబ్బ నవ్వించాయి. యువకుల వేషధారణాలు ఆకట్టుకున్నాయి. హోలీ పున్నమిని పురస్కరించుకుని స్థానిక ఉరువకొండ మఠం (విరక్త మఠం) పరిసర ప్రాంతానికి చెందిన యువకులు, పెద్దలు గత నెల 27న ప్రారంభించిన వేడుకల్లో రోజూ హాస్య సన్నివేశాలను ప్రదర్శించారు. మంగళవారం రాత్రి జరిగిన ప్రధాన కార్యక్రమాన్ని చూసేందుకు గ్రామస్తులు భారీగా తరలి వచ్చారు. మంగళవారం అర్ధరాత్రి కామన్న (మన్మథ) దహనం జరగడంతో బుధవారం ఉదయం మన్మథుడి మృతదేహం ఊరేగింపు, కామన్నకు పునర్జన్మ రావడంతో మన్మథుడు, రతి పెళ్లి ఊరేగింపు నిర్వహించారు.
ఘనంగా హోలీ వేడుకలు..
బుధవారం రతీ, మన్మథుల వివాహం సందర్భంగా సంతోషంతో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లుకున్నారు. ఎద్దుల బండ్లపై రంగునీళ్ల డ్రమ్ములను ఉంచి వీధి వీధి తిరిగి జనాలపై రంగు నీళ్లు జల్లి సంబరం చేసుకున్నారు.


