కర్నూలు (అగ్రికల్చర్): జిల్లాలో 2025–26 సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ పనులను నలుగురు సభ్యులు కలిగిన సెంట్రల్ టీం తనిఖీలు చేపట్టింది. ఈనెల 9 నుంచి 14వ తేదీ వరకు ఢిల్లీలోని గ్రామీణాభివృద్ధి శాఖ ఆడిట్ విభాగం ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. వెల్దుర్తి, మద్దికెర, దేవనకొండ, కర్నూలు, తుగ్గలి మండలాల్లో ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించి కూలీలతో చర్చించారు. ఉపాధి నిధులతో చేపట్టిన పండ్ల తోటలను కూడా పరిశీలించారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన సీసీ రోడ్లు, పశువుల షెడ్ల పురోగతిని అధ్యయనం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వీబీజీ రామ్‌జీ చట్టంపై నిర్వహిస్తున్న కార్యక్రమాలను కూడా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ముగిసిన అనంతరం కలెక్టరేట్‌లోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ మాధవీలతతో సమావేశమయ్యారు. తమ పర్యటనకు అన్ని విధాలా సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి తాము చేపట్టిన తనిఖీలపై నివేదిక ఇస్తామని ప్రకటించారు. కాగా ఆదివారం నుంచి సెంట్రల్ టీమ్ ప్రతినిధులు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు.


