హామీలు విస్మరించి.. విమర్శలతో ముగించి! | - | Sakshi
Sakshi News home page

హామీలు విస్మరించి.. విమర్శలతో ముగించి!

Mar 10 2026 12:49 PM | Updated on Mar 10 2026 12:49 PM

బాబు పర్యటన అలా ముగిసింది..

డోన్‌: మండల పరిధిలోని కొత్తబురుజు గ్రామంలో సోమవారం సీఎం చంద్రబాబు ‘రైతన్నా మీ కోసం’లో భాగంగా చేపట్టిన పర్యటన ఆద్యంతం రాజకీయ విమర్శలు, ఆరోపణలకే పరిమితమైంది. రైతులకు కొత్త పాస్‌ పుస్తకాలు రాజముద్రతో ఇచ్చానని పేర్కొంటూనే రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంటుందనేది మాత్రం చంద్రబాబు చెప్పలేకపోయారు. నిత్యం కరువు కాటకాలతో అల్లాడిపోయే డోన్‌ నియోజకవర్గ ప్రాంత రైతులకు సాగునీటి సౌకర్యం కోసం తీసుకుంటున్న ప్రణాళికా బద్ధమైన చర్యలను చెప్పడంలో కూడా విఫలమయ్యారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం, గత ప్రభుత్వం వ్యవస్థల్లో విధ్వంసం సృష్టించిందని ప్రజలను నమ్మించే ప్రయత్నమే తప్పితే ఆయన గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటిలో నెరవేర్చిన వాటి సంఖ్యను చెప్పకపోవడం గమనార్హం. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చివేయడం, జంతు చర్మాలతో చేసిన చెప్పులతో వేంకటేశ్వర స్వామి దర్శనానికి చంద్రబాబు వెళ్లడాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తుచేసుకున్నారు. టైటిల్‌ డీడ్‌ యాక్ట్‌ను రద్దుచేస్తానని, భూ రీసర్వేను ఆపివేస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అదేవిధానాన్ని కొనసాగించడాన్ని కూడా రైతులు గుర్తుచేసుకుంటున్నారు.

హామీలు తూచ్‌!

సభ ప్రారంభం కాగానే ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి డోన్‌ను తిరిగి కర్నూలు జిల్లాలో విలీనం చేయాలని, అవుకు రిజర్వాయర్‌ నుంచి ప్యాపిలి మండలం కొండ మీది పల్లెలకు సాగునీరు అందజేయాలని, నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాల వద్ద భూగర్భ జలాల పెంపునకు అధిక నిధులు విడుదల చేయాలని కోరినా సీఎం చంద్రబాబు స్పందించలేదు. అన్నీ పరిశీలిస్తామని ముక్తసరిగా చెప్పి దాటవేయడం గమనార్హం. జలదుర్గం మండల కేంద్రం ఏర్పాటు అంశాన్ని ఎత్తకపోవడం ప్రజల్లో చర్చకు తావిచ్చింది.

బీసీ సర్పంచ్‌కు అవమానం

సభ ప్రారంభమై అరగంట గడిచినా స్థానిక గ్రామ సర్పంచ్‌ అయిన బీసీ మహిళ ప్రమీలను వేదికపైకి పిలవకపోవడం పట్ల రైతుల్లో ఆగ్రహం కనిపించింది. ఉడుములపాడు సర్పంచ్‌ ఉప్పరి రాధమ్మ భర్త సర్పంచ్‌ లేకుండా గ్రామసభ ఎలా జరుపుతారంటూ కేకలు వేస్తూ సర్పంచ్‌ను పిలవండి అంటూ గట్టిగా అరిచారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తమ తప్పు తెలుసుకొని సర్పంచ్‌ ప్రమీలను వేదికపైకి ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement