పాములపాడు: స్థానిక శ్రీ శివ బ్రహ్మ మల్లికార్జున స్వా మి ఆశ్రమంలో 47 సంవత్సరాలుగా కన్నడ పాదయాత్రికులకు అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు శేషన్న గౌడు మాట్లాడుతూ.. భక్తులు, దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. జూటూరు గ్రామం జగనన్న కాలనీలో గ్రామానికి చెందిన కుళాయప్ప సొంతంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో సర్పంచు నాయిని సావిత్రమ్మ, మధుసూదన్‌రావు, భజన చౌడయ్య, మన్నె పుల్లయ్య, రామకృష్ణ, శ్రీని వాసులు, మల్లికార్జున శివ, నాగరాజు, భజన బృంద సభ్యులు పాల్గొన్నారు.
ఏడు పదుల వయస్సులో..
పాములపాడు: అతని వయస్సు 70 ఏళ్లు.. వందల కి.మీ పాదయాత్రగా శ్రీశైలం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ వయస్సులో కూడా హుషారుగా ఓం నమః శ్శివాయ అంటూ నడక సాగిస్తున్న వృద్ధుడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన శివపుత్ర అనే వృద్ధుడు పాదాలకు స్వతహాగా తయారు చేసుకున్న బట్ట పాదరక్షకులతో వడివడిగా నడక సాగిస్తున్నారు. ఇప్పటికి సుమారు 10 రోజులుగా 300 కిలోమీటర్లకు పైగా నడిచారు. మధ్యాహ్న వేళ సేద తీరుతూ ఉదయం, సాయంత్రం వేళల్లో నడక సాగిస్తున్నట్లు తెలిపారు. స్వామిపై ఉన్న భక్తితో వెళ్తున్నానని, ఆయనే తన దరికి క్షేమంగా చేర్చుకుంటాడని తెలిపారు.
శ్రీశైలం చేరుకున్న తెలంగాణ గవర్నర్
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా శ్రీశైలం చేరుకున్నారు. శుక్రవారం రాత్రి శ్రీశైలం చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు భ్రమరాంబా అతిథిగృహం వద్ద శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, పలువురు అధికారులు పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. రాత్రి కి భ్రమరాంబా అతిథి గృహంలో బస చేస్తారు. శనివారం ఉదయం 6 గంటలకు మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారని దేవస్థానం అధికారులు తెలిపారు.


