కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్, ఏఐఎస్‌ఏ, పీడీఎస్‌యూ, ఆర్‌పీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. విద్యార్థి సంఘాల నేతలు వర్సిటీలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఏ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, ఆర్‌పీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఏఐఎస్‌ఏఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.శరత్‌కుమార్ మాట్లాడుతూ.. వర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఖజానాకు కన్నం వేస్తున్న రిజిస్ట్రార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలన్నారు. రిజిస్ట్రార్‌పై పలుమార్లు వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేసినా విచారణకు స్పందించకపోవడం, తొలగించకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. వర్సిటీలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐఎస్‌ఎఫ్ నాయకులు హరిష్, రాజు, ఏఐఎస్‌ఏ నాయకులు రాము, ఆర్పీఎస్ నాయకులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


