శ్రీశైలంటెంపుల్: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో ఇటీవల విస్ఫోటనం జరిగి 22 మంది మృతి చెందారు. మరికొంత మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలు వచ్చాయి. నిత్యం జనాభా ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు కూడా ఇవ్వలేదు. శ్రీశైల క్షేత్రంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుండటంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. అయినా ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. పది రోజుల క్రితం దేవస్థాన కాటేజీలో ఏసీ పేలడంతో అక్కడ ఉన్న వారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటన మరువక ముందే దేవస్థాన పరిధిలోని రెండు ప్రైవేట్ సత్రాల్లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చేలరేగాయి. ఈ ఘటనల్లో భక్తులకు ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
పది రోజుల్లో మూడు అగ్ని ప్రమాదాలు
శ్రీశైలంలో 10 రోజుల వ్యవధిలో మూడు చోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దేవస్థాన వసతి విభాగ అధికారుల నిర్లక్ష్యంతో ఫిబ్రవరి 21న వీఐపీ కాటేజీలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. అబ్బూరు శ్రీనివాసరావు నిలయం కాటేజీలో ఉన్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. కాటేజీలో సేద తీరుతున్న 13 మంది భక్తులు ఒక్కసారిగా కిందకు పరుగులు తీశారు. కాటేజీలోని మొదటి అంతస్తులోని గదిలో ఏసీ పేలడంతో మంటలు చేలరేగాయి. కాటేజీలో ఉన్న భక్తులకు భయాందోళనకు గురై ఏమి చేయాలో దిక్కుతోచక ఒక్కసారిగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు. అలాగే ఫిబ్రవరి 26న శ్రీశైలంలోని దేవాంగ సత్రంలో షార్ట్‌సర్క్యూట్ అయ్యి మంటలు వచ్చాయి. అలాగే ఫిబ్రవరి 28న శ్రీశైలంలోని గురు సదన్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్యానెల్ బోర్డు కాలిపోయింది. అయితే ఇవన్నీ చిన్నపాటి అగ్నిప్రమాదాలు కావడంతో భక్తులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
నిర్లక్ష్యం
శ్రీశైలంలో వసతి విభాగం పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సహాయ కార్యనిర్వహణాధికారిని నియమించారు. వసతి గదుల కేటాయింపు, హౌస్‌కీపింగ్, శానిటేషన్ తదితర పనులను పర్యవేక్షించాల్సి ఉంది. అధికారి పర్యవేక్షణ లోపంతోనే వీఐపీ కాటేజీలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్ర పరిధిలో ఉన్న ప్రైవేట్ సామాజిక సత్రాల్లో అగ్నిప్రమాదాల నివారణ బాధ్యత కూడా సదరు అధికారిపై ఉంది. అయితే ఆ అధికారి విధులపై నిర్లక్ష్యం వహించడంతో క్షేత్రంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్న అరోపణలు వినిపిస్తున్నాయి.
శ్రీశైల దేవస్థాన కాటేజీల్లో, ప్రైవేట్ సత్రాలు తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికే పలు సత్రాల వారికి ఈ విషయం చెప్పాం. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దేవస్థాన సిబ్బందికి, ప్రైవేట్ సత్రాల వారికి అవగాహన కల్పిస్తాం. దేవాంగ సత్రంలో జరిగిన షార్ట్‌సర్క్యూట్ జరిగినా మా సిబ్బంది వెళ్లి ప్రమాదాన్ని నివారించారు. – శంకర్‌ప్రసాద్, జిల్లా ఫైర్ ఆఫీసర్
శ్రీశైలంలో తరచూ అగ్నిప్రమాదాలు
దేవస్థాన కాటేజీలో,
ప్రైవేట్ సత్రాల్లో మంటలు
ఎక్కడా కనిపించని
ఫైర్ సేఫ్టీ పరికరాలు
కాటేజీలు, ప్రైవేట్ సత్రాలపై
పర్యవేక్షణ మరచిన అధికారులు
కనిపించని అగ్నిమాపక పరికరాలు
శ్రీశైల దేవస్థానం పరిధిలోని వీఐపీ కాటేజీలలో అను నిత్యం వీఐపీలు బస చేస్తారు. అయితే ఒక్క కాటేజీలో సైతం ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవని తెలుస్తోంది. న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల, వ్యాపారులు వీఐపీ కాటేజీలలో బస చేస్తారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న కాటేజీలలో ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. రూ.కోటి ఖర్చు చేసి నిర్మించే కాటేజీకి డోనర్‌కు చెబితే రూ.10వేలతో ఫైర్‌సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేస్తారు కదా అని భక్తులు పేర్కొంటున్నారు. అలాగే క్షేత్ర పరిధిలోని పలు ప్రైవేట్ సత్రాల్లో కూడా ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవని తెలుస్తోంది.


