● జాయింట్ కలెక్టర్
నూరుల్ ఖమర్
కర్నూలు (సెంట్రల్): ప్రభుత్వ పాఠశాలలను, అంగన్‌వాడీ కేంద్రాలను కచ్చితంగా తనిఖీ చేయాలని ఆర్‌డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓలను జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, హౌసింగ్, రెవెన్యూ తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మధ్యాహ్నం విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, రుచి ఏ విధంగా ఉందనే విషయాలను తనిఖీ చేయాలన్నారు. హౌసింగ్‌కి సంబంధించి ఆప్షన్–3 కింద కాంట్రాక్టర్లు నిర్మించిన ఇళ్లలో 2,522 ఇళ్లలో నిర్మాణ లోపాలను గుర్తించారన్నారు. ఇప్పటివరకు 1,521 ఇళ్ల నిర్మాణాల లోపాలను సరిచేయడం జరిగిందని, మిగిలిన 1001 వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఉగాది నాటికి పూర్తి చేయాల్సిన ఇళ్ల నిర్మాణాలలో పురోగతి లేకపోవడంపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ క్లినిక్‌కి సంబంధించి పరిష్కరించాల్సిన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అందులో ప్రధానంగా వర్గీకరణ మార్పు (క్లాసిఫికేషన్ ఛేంజ్), నిషేధిత జాబితా (ప్రొహిబిటెడ్ లిస్ట్) అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇనామ్ భూములకు సంబంధించి వాటివి కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మ్యూటేషన్‌కి సంబంధించి వచ్చిన అర్జీలు బియాండ్ ఎస్‌ఎల్‌ఏ వెళ్లకుండా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, డీఈఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


