శ్రీశైలం: సున్నిపెంట – శ్రీశైలం ఘాట్ మార్గంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. రహదారిలో మలుపు వద్ద భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బందితో అక్కడికి చేరుకుని చెట్టును తొలగించే వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చేశారు. ఘాటు మార్గంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ వారు వాహన చోదకులకు సూచించారు.
కర్నూలు(సెంట్రల్): తాను ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, డోన్, నంద్యాల ప్రాంతాల్లో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్ హనుమదాసు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తాను రూ.3 కోట్లతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు, మంచినీటి పనులకు సంబంధించిన పనులు చేశానని, అయితే ఇంత వరకు ఒక్క రూపాయి బిల్లు చెల్లించలేదన్నారు. అప్పుల తెచ్చి పనులు చేయించానని, ప్రభుత్వం చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగి అప్పులపాలయ్యాయని, వెంటనే చెల్లించకపోతే ఇబ్బందికరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తహసీల్దార్
కార్యాలయంలో పాము
కల్లూరు: స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సోమవారం పాము కలకలం రేపింది. కార్యాలయంలో పని చేసి సిబ్బంది బైక్‌లోకి పాము దూరింది. గుర్తించిన స్థానికులు, కార్యాలయం సిబ్బంది చాలా సేపు దానిని బయటకు రప్పించడానికి ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో పాములు పట్టే వ్యక్తి వచ్చి బయటకు తీశారు. దీంతో కార్యాలయ సిబ్బంది, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
పాముకాటుతో వ్యక్తి మృతి
కొత్తపల్లి: పాముకాటుకు గురై చికిత్స పొందుతూ కోలుకోలేక ఎర్రమఠం గ్రామానికి చెందిన టేకులనాగరాజు(50)అనే వ్యక్తి మృతి చెందాడు. మొక్కజొన్న పంటనుకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లి ఫిబ్రవరి 28న ఈయన పాముకాటుకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా అక్కడ ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి టేకుల పెద్ద పుల్లయ్య ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రవీంద్రబాబు తెలిపారు.
కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా డిమాండ్ చేశారు. సోమవారం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ కోసం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా హామీని అమలు చేయకపోవడంతో ఎంతో మంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. మరోవైపు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడంతోపాటు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయని నేపథ్యంలో ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. లేకపోతే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.


