● ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు
కర్నూలు: ‘మేమిద్దరం పదేళ్లుగా దూరంగా ఉంటున్నాం... నా పేరు మీద గూడూరులో ఉన్న ప్రైవేటు స్కూల్‌ను భర్త రమేష్ ఆక్రమించుకోవాలని నా సంతకాలు ఫోర్జరీ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. పిల్లలను కూడా పట్టించుకోకుండా ఆస్తి, చెక్‌బౌన్స్ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నాడు’ అని కర్నూలుకు చెందిన రాధిక ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలులోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 65 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్టపరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారమయ్యేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డీఎస్పీ బాబుప్రసాద్, సీఐ శివశంకర్, తదితరులు కూడా పీజీఆర్‌ఎస్‌లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని...
● విద్యాంజలి పథకం కింద ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి హైదరాబాద్‌కు చెందిన సుజాత ఠాకూర్ రూ.40 లక్షలు డబ్బులు తీసుకుని మోసం చేసిందని కర్నూలు బీక్యాంప్‌కు చెందిన అహ్మదున్నీసా ఫిర్యాదు చేశారు.
● బెంగళూరులోని డెలాయిట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పామిడికి చెందిన చింతల సోమశేఖర్ రూ.లక్ష తీసుకుని మోసం చేశాడని ఆదోని పట్టణానికి చెందిన నరేంద్రకుమార్ ఫిర్యాదు చేశారు.
● పెద్ద కుమారుడు తన బాగోగులు పట్టించుకోకుండా ఆరోగ్యపరిస్థితి బాగలేకపోయినప్పటికీ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సి.బెళగల్ మండలం కంపాడు గ్రామానికి చెందిన యశోదమ్మ ఫిర్యాదు చేశారు.
● భర్త గుండెపోటుతో మృతిచెందారని, ఆయన పేరు మీద వచ్చిన జీవిత బీమా (ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, విచారణ జరిపించి న్యాయం చేయాలని ఆస్పరి మండలానికి చెందిన సుగుణమ్మ ఫిర్యాదు చేశారు.


