బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలోని శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారికి పల్లకీ సేవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో ఏకశిలా రూపంలో కొలువైన శ్రీ ఉమామహేశ్వరస్వామికి అభిషేకం, అర్చన తదితర ప్రత్యేక పూజలు చేపట్టారు. సాయంత్రం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు పల్లకీ సేవా కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పాండురంగారెడ్డి, చైర్మన్ బండి మౌలిశ్వరరెడ్డి, పాతపాడు సర్పంచ్ మహేశ్వరరెడ్డి తదితర భక్తులు ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు.
హాస్టల్ లైబ్రరీకి పుస్తకాల వితరణ
కర్నూలు (అర్బన్): నగరంలోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల నెం.1 వసతి గృహంలోని లైబ్రరీకి పంచాయతీరాజ్ డీఈఈ, ఏపీఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు పి.మల్లికార్జున, నీట్, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను ఇచ్చినట్లు వసతి గృహ సంక్షేమాధికారిణి బి.బెన్నమ్మ తెలిపారు. సోమవారం స్థానిక హాస్టల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యులుగా కూడా ఆయన పేద, మధ్య తరగతి విద్యార్థుల విద్యకు సంబంధించి పలు సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నారని తెలిపారు. దాతల నుంచి కళాశాల విద్యార్థినులకు అవసరమైన పుస్తకాలను సేకరించి హాస్టల్ లైబ్రరీలో నిక్షిప్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ లైబ్రరీని హాస్టల్‌లోని విద్యార్థినులందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని బెన్నమ్మ తెలిపారు.


