ఆదోని రూరల్: హోలీ పండగ అంటే రంగుల పండగ అంటూ అందరూ ఆనందంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం ఎక్కడైనా చూసుంటాం. కానీ సంతెకూడ్లూరు గ్రామంలో మాత్రం వింతగా ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న ఈ గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది. గ్రామంలో వెలిసిన రతీమన్మథుల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. కోరికలు తీరిన భక్తుల్లో పురుషులు ఆనవాయితీ ప్రకారం మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేకంగా సీ్త్ర వేషంలో చీర కట్టి అందంగా అలంకరించుకుని కలశాలతో రతీ మన్మథుల ఆలయానికి డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా చేరుకున్నారు. పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి పూజలు చేశా రు. వేడుకలను చూసేందుకు ఆంధ్రా నుంచే గాక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బుధవారం రాత్రి కామప్పను దహనం చేసిన గుంత వద్దకు సీ్త్ర వేషధారణలో వెళ్లిన పురుషులు బోరున విలపిస్తూ బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎద్దుల సంత నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు ఎద్దులను కొనుగోలు చేసేందుకు తరలివచ్చారు. భక్తుల మధ్య రతీమన్మథుల రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
కోర్కెలు నెరవేరి సీ్త్ర వేషధారణలో
మొక్కులు చెల్లింపు
సంతెకూడ్లూరులో కొనసాగిన
వింత ఆచారం
వైభవంగా రతీమన్మథుల రథోత్సవం


