బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

Mar 6 2026 8:18 AM | Updated on Mar 6 2026 8:18 AM

ఆగమోక్తంగా ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా సకల దేవతలకు వీడ్కోలు

ఆళ్లగడ్డ: శ్రీ అహోబిలేశుడి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన ధ్వజావరోహణ కార్యక్రమాన్ని గురువారం తెల్లవారుజామున ఆగమోక్తంగా చేపట్టారు. 10 రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల మొదటిరోజు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. చివరిరోజు గురువారం వేదమంత్రాచ్ఛారణల మధ్య ధ్వజావరోహణం (గరుడ పటాన్ని కిందకు దించడం) చేసి సకల దేవతలకు వీడ్కోలు ఉత్సవం చేపట్టారు. ముందుగా ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి, తిరుమంజన సేవ గావించిన అనంతరం ఆలయ ధ్వజస్తంభం వద్దకు వేంచేశాక ముద్రక్త ఆగమశాస్త్రం ప్రకారం వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజస్తంభంపై ఉన్న గరుడ పటాన్ని శాస్త్రోక్తంగా కిందకు దించారు. అనంతరం ముద్రకర్త కీడాంబి వేణుగోపాలన్‌ ఆధ్వర్యంలో అర్చక బృందం గరుడ ధ్యానం, భేరీపూజ, భేరితాడనం, గరుడ గద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక మంత్రాలను జపించి బ్రహ్మోత్సవాలు ముగిసినట్టు వేద పారాయణం ద్వారా ప్రకటించారు. గత నెల 21వ తేదీ మొదలైన బ్రహ్మోత్సవ వేడుకలకు మొదట్లో భక్తులు పెద్దగా కనిపించలేదు. చివరి ఘట్టాలైన రథోత్సవం, కల్యాణోత్సవం, గరుడ సేవకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు, వసతులు కల్పించడంలో పూర్తిగా సఫలీకృతులయ్యారు.

దివ్యాంగులు,

వయో వృద్ధులకు తప్పని ఇక్కట్లు..

ఉత్సవాల్లో నేపథ్యంలో ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాల్లో అధికారులు స్వామి దర్శనాలకు వీఐపీలు, వీవీఐపీలకే ప్రాముఖ్యత ఇచ్చారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, గర్భణులు, చంటిపిల్లలు తల్లులు దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్ల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించక పోవడంతో తోపులాట చోటు చేసుకుని పలువురు స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. గుడిబయట నుంచే ముక్కుబడులు చెల్లించుకుని వెనుదిరగాల్సిన దుస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement