మద్దికెర: శ్రీరంగనాథుడు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మండల పరిధిలోని పెరవలి గ్రామంలో కొలువైన శ్రీరంగనాథుడు శ్రీదేవి, భూదేవి సమేతంగా గురువారం గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో స్వామివారికి బిందెసేవ, పంచామృతాభిషేకం, అష్టోత్తరనామార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామి వారి ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై కొలువుంచా రు. అనంతరం ప్రభోత్సవం గ్రామ పుర వీధుల్లో మేళతాళాల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ వీరయ్య, ఆలయ చైర్మన్ రవికుమార్, అర్చకులు రంగస్వామి, మధుస్వామి, నరసింహస్వామి, సిబ్బంది రఘు పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
నీటి కుంటలో పడి 80 గొర్రెలు మృత్యువాత
బనగానపల్లె: చెరువుపల్లె గ్రామ సమీపంలో గురువారం మధ్యాహ్నం నీటి కుంటలో పడి 80 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. బేతంచర్ల మండలం బుగ్గానిపల్లి, కొలుములపల్లి గ్రామాలకు చెందిన గొర్రెల యజమానులు తమ గొర్రెలను మేపుతూ బనగానపల్లె మండలం నందవరం గ్రామానికి చేరుకున్నారు. కొద్ది రోజులుగా తమ గొర్రెలను గ్రామ పొలిమేరల్లో మేపుతున్నారు. గురువారం చెరువుపల్లె సమీపంలో నీటి కుంటలో నీరు తాగేందుకు వెళ్లిన గొర్రెలు ఒకదానిపై ఒకటి పడటంతో ఊపిరాడక 80 మృతి చెందాయి. ఈ ప్రమాదంలో నాగేష్‌కు చెందిన 40 గొర్రెలు, పరశురాముడు 20, శేఖర్ 10, మల్లికార్జున 10 గొర్రెలు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 10 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం పరిహారం అందజేసి తమను ఆదుకోవాలని కోరారు.
కొండాపురంలో ఇరువర్గాల ఘర్షణ
సి.బెళగల్: కొండాపురం గ్రామంలో గురువారం ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో రెండు సామాజిక వర్గాలకు చెందిన యువకుల మధ్య 2023లో జరిగిన క్రికెట్ పోటీల విషయంపై రెండు రోజుల క్రితం వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పంతాలకు వెళ్లిన ఇద్దరు యువకులు వారి బంధుమిత్రులతో కలసి పరస్పరం దాడులకు సిద్ధమయ్యారు. అందరూ ఒక చోట గుమికూడి ఘర్షణ పడుతుండగా సమాచారం అందుకున్న కోడుమూరు సీఐ తబ్రేజ్, సి.బెళగల్ ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కొండాపురంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముందస్తు చర్యగా పలు ప్రాంతాల నుంచి పోలీసులు గ్రామంలో మొహరించారు. అనంతరం పెద్దలు, పోలీస్ అధికారుల జోక్యంతో ఘర్షణ పరిస్థితులు సద్దుమణిగాయి. కర్నూలు ట్రాఫిక్ సీఐ మనుసూరుద్దీన్, ఇంటెలిజెన్స్ సీఐ (జోనల్ ఇన్‌చార్జ్) వెంకటరామిరెడ్డి, ఎస్‌ఐ పీరయ్య ఇతర పోలీస్ అధికారులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.


