రైతులకు ‘ఆటోమేషన్‌’ మేలు | - | Sakshi
Sakshi News home page

రైతులకు ‘ఆటోమేషన్‌’ మేలు

Mar 3 2026 8:20 AM | Updated on Mar 3 2026 8:20 AM

కర్నూలు(సెంట్రల్‌): బిందు సేద్యంలో ఆటోమేషన్‌ సాంకేతికత రైతులకు ఎంతో మేలు చేస్తుందని జేసీ నూరుల్‌ ఖమర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆధునిక సాగు ఆటోమేషన్‌ పథకం పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కింద జల్లాలోని రైతులకు సాగునీటి ఆటోమేషన్‌ పథకం అమలవుతుందన్నారు. ఈ పద్ధతితో రైతులు ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వినియోగించుకోవచ్చన్నారు. చిన్న, సన్నకారు రైతులకు 55 శాతం, ఇతర రైతులకు 45 శాతం రాయితీ ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాలు, ఉద్యానవన శాఖ కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకునే సమయంలో భూమి పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు వివరాలు తీసుకొని వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్‌పీడీ చిరంజీవి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

అప్పుల బాధతో

రైతు ఆత్మహత్య

తుగ్గలి: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తుగ్గలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కడమకుంట్ల గ్రామానికి చెందిన కాయల శ్రీనివాసులు(46)కు జొన్నగిరికి చెందిన సువర్ణమ్మతో 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వీరు జొన్నగిరిలోనే నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. గిరిగెట్ల సమీపంలో ఉన్న రెండెకరాలతో పాటు మరో 6 ఎకరాలు కౌలు తీసుకుని పంటలు టమాట, ఇతర పంటలు సాగు చేశారు. వ్యవసాయ పెట్టుబడికి, కుటుంబ పోషణకు చేసిన అప్పులు రూ.8 లక్షలకు చేరుకున్నాయి. వీటిని తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై సోమవారం పొలంలో పురుగుల మందు తాగి శ్రీనివాసులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుత్తికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య సువర్ణమ్మ, కూతుళ్లు ప్రవీణ, సింధు, కుమారుడు యోక్షిత్‌ ఉన్నారు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తుగ్గలి పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఏఎల్‌ఎం మృతి

చాగలమర్రి: పెద్దబోధనం గ్రామంలోని విద్యుత్‌ సబ్‌–సబ్‌స్టేషన్‌ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పెద్దబోధనం సబ్‌–సబ్‌స్టేషన్‌లో విఽధి నిర్వహణలో ఉన్న ఏఎల్‌ఎం ఈదుల శివప్రసాద్‌రెడ్డి(45) గ్రామంలో విద్యుత్‌ సరఫరా లోపం ఉందని, లైన్‌మెన్‌ తిరుపతయ్యతో కలిసి బైక్‌పై సబ్‌–స్టేషన్‌ నుంచి బయలుదేరారు. జాతీయ రహదారిపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు చాగలమర్రి వైపు నుంచి అతి వేగంగా వచ్చిన గుర్తు తెలియని ఆటో అదుపుతప్పి బైక్‌ను వెనుక వైపు నుంచి ఢీ కొంది. బైక్‌పై ఉన్న శివప్రసాద్‌రెడ్డి, తిరుపతయ్యకు తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్‌లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి శివప్రసాద్‌రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించా రు. తిరుపతయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాలకు రెఫర్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజారెడ్డి తెలిపారు.

రెండు బైకులు ఢీ.. బాలుడి దుర్మరణం

దేవనకొండ:కరిడికొండ గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో రంజిత్‌(06) మృతి చెందాడు. బండగట్టు గ్రామానికి చెందిన వీరస్వామి అనే వ్యక్తి బైకుపై తన కుమారుడితో కలిసి దేవనకొండకు వస్తున్నాడు. అలాగే రాతన గ్రామం నుంచి కర్నూలుకు వెళ్తున్న మరో బైకు కరిడికొండ స్టేజి దగ్గర ఎదురెదురుగా ఢీకొన్నాయి. బైకుపై ఉన్న బాలుడు రంజిత్‌ రోడ్డుపై పడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడి తండ్రి వీరస్వామికి కాలుకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని..

నంద్యాల(అర్బన్‌): బైక్‌ను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటన సోమవారం నంద్యాల కొత్తపల్లె రోడ్డులోని ఆంజనేయస్వామి టెంపుల్‌ వద్ద చోటు చేసుకుంది. రూరల్‌ సీఐ చాన్‌బాషా తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల పట్టణం విశ్వనగర్‌కు చెందిన సుబ్బయ్య(42) పనినిమిత్తం ఆత్మకూరుకు వెళ్లి నంద్యాలకు తిరిగి మోటారుసైకిల్‌పై వస్తున్నాడు. నంద్యాల నుంచి ఆత్మకూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను ఢీకొట్టండంతో సుబ్బయ్యకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement