ప్యాపిలి: దోమల వ్యాప్తితోనే డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలుతాయని జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖర రావు అన్నారు. స్థానిక పీహెచ్‌సీని శుక్రవారం ఆయన సందర్శించారు. పీహెచ్‌సీ పరిధిలో నమోదైన డెంగీ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని ఒకటో సచివాలయాన్ని సందర్శించి అక్కడి ప్రజలతో ఆయన మాట్లాడారు. నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం ద్వారా జ్వరాలు వస్తాయన్నారు. ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమల వ్యాప్తిని అరికట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ, డోన్ సబ్ యూనిట్ అధికారి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
మార్కెట్ వేలాలు రద్దు చేయాలి
ఎమ్మిగనూరురూరల్: ఈ నెల 4వ తేదీన జరిగిన మున్సిపాలిటీ మార్కెట్ వేలాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, జిల్లా కలెక్టర్ స్పందించి వాటిని రద్దు చేయాలని టీడీపీ మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్రప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, మున్సిపల్ ఆర్‌ఐ అస్లాంబాషా నిబంధనలకు విరుద్ధంగా వేలాలు నిర్వహించి అధికార పార్టీ వారికి వత్తాసు పలికారన్నారు. వేలాల్లో పాల్గొనే వారు డిపాజిట్ అమౌంట్‌ను బ్యాంక్ డ్రాప్ట్ తేవాలని మున్సిపల్ గెజిట్‌లో ఉండగా కమిషనర్ చెక్కు తీసుకొని వేలం పాట నిర్వహించటం చట్ట విరుద్ధమన్నారు. జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
భ్రమరాంబాదేవికి కొబ్బరికాయల సమర్పణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శుక్రవారం కొబ్బరికాయలు సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి, పసుపు, కుంకుమలతో వాటికి పూజలు జరిపారు. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించారు. చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం (ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు) భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 7న కుంభోత్సవం నిర్వహించనున్నారు. అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు మొదలైనవి సమర్పించి కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం.


