కర్నూలు(అగ్రికల్చర్): 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయంలో మహిళా రైతులను విశేషంగా ప్రోత్సహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. శనివారం కర్నూలులోని ఉద్యానభవన్‌లో భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ(ఎంఏఆర్‌ఐ), జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఒక్కరోజు ముందుగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం నిర్వహించారు. వివిధ మండలాల నుంచి మహిళా రైతులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయంలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి మాట్లాడుతూ మహిళా రైతులు, కూలీలు ప్రతి ఒక్కరూ సుకన్య సమృద్ధి యోజన పథకంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామిరెడ్డి మురళి, డీఆర్‌డీఏ డీపీఎం నరసమ్మ, జెండర్ కో–ఆర్డినేటర్ ఆశాలత, రచయిత్రి తోట అపర్ణ, వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారి అక్బర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.


