దేవనకొండ: టమాటా ధర పతనం కావడంతో రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. కిలో టమాటా బహిరంగ మార్కెట్‌లో రూ.20 ఉండగా, రైతుల దగ్గర మాత్రం వ్యాపారులు కేవలం కిలో రూ.2కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కనీసం తెంపిన కూలీ ఖర్చులు కూడా రాక రైతులు టమాటాను తెంచకుండానే పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి టమాటా రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
గ్యాస్ కొరత ఆసరాగా
సైబర్ మోసాలు: ఎస్పీ
కర్నూలు: ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.. వెంటనే బుకింగ్ చేసుకోండి.. అంటూ తప్పుడు సందేశాలు పంపిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఎస్పీ పేర్కొన్నారు. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, నకిలీ లింకుల ద్వారా గ్యాస్ సబ్సిడీ, గ్యాస్ బుకింగ్, ప్రత్యేక డిస్కౌంట్‌ల పేరుతో మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు అధికారిక గ్యాస్ ఏజెన్సీ యాప్‌లు లేదా అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించాలన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నెంబర్ 1930కు ఫోన్ చేయాలని సూచించారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమం పరిశీలన
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలోని డాక్టర్స్ కాలనీ యుపీహెచ్‌సీలో నిర్వహిస్తున్న హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం డీఐఓ డాక్టర్ ఉమ పరిశీలించారు. వ్యాక్సిన్ స్టాక్ స్టేటస్‌ను తెలుసుకున్నారు. అక్కడి నుంచి అరోరా నగర్ సచివాలయం సందర్శించి రెగ్యులర్ టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఇంటింటి సర్వే చేసి, 14 సంవత్సరాల వయస్సున్న ఆడపిల్లలను గుర్తించి యుపీహెచ్‌సీలలో వ్యాక్సినేషన్ చేయించాలని సూచించారు. ఆమె వెంట హెచ్‌ఈఈఓ బాబా ఫకృద్దీన్, సిబ్బంది ఉన్నారు.
1.75 లక్షల హెక్టార్లలో రబీ పంటల సాగు
కర్నూలు(అగ్రికల్చర్): 2025–26 రబీ సీజన్‌కు సంబంధించి పంటల నమోదు ప్రక్రియ ముగిసింది. రైతు సేవా కేంద్రాల వారీగా పంటల నమోదు వివరాలను రైతులకు అందుబాటులో ఉంచారు. రైతులు ఈ వివరాలను పరిశీలించి పంటల నమోదుపై అభ్యంతరాలు ఉంటే ఆర్‌ఎస్‌కేల్లో రాత పూర్వకంగా చెప్పవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలకు గురువారం ఒక్క రోజే అవకాశం ఉందన్నారు. ఈ నెల 15 వరకు పంటల నమోదుపై సోషల్ ఆడిట్ కొనసాగుతుందన్నారు. పంటల నమోదుకు ఈ–కేవైసీ తప్పనిసరి అని, బయోమెట్రిక్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. రబీలో సాధారణ సాగు 1.07 లక్షల హెక్టార్లు ఉండగా.. 1,75,711 హెక్టార్లలో పంటలు సాగయ్యాయన్నారు.


