కర్నూలు(హాస్పిటల్): కిడ్నీ వ్యాధులు రాకుండా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు సూచించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం పురస్కరించుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీ రాజ్‌విహార్ సెంటర్ వరకు కొనసాగి తిరిగి ఆసుపత్రిలోని క్యాజువాలిటీ వరకు సాగింది. ఈ సందర్భంగా డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అధునాతన చికిత్సలు, డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలు లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. నెఫ్రాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ అనంత్, డాక్టర్లు పీఎల్.వెంకట పక్కిరెడ్డి, శ్రీధరశర్మ తదితరులు పాల్గొన్నారు.


