కర్నూలు (టౌన్): వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలులోని ఎస్‌బీఐ సర్కిల్‌లో ఉదయం 9.30 గంటలకు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామన్నారు. అనంతరం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో వైఎస్సార్‌సీపీ జెండాను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
‘ఆటోమేషన్’తో ఇంటి నుంచే డ్రిప్ నిర్వహణ
కర్నూలు(అగ్రికల్చర్): బిందు సేద్యం పొందిన రైతులకు సబ్సిడీపై ఆటోమేషన్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సన్న, చిన్నకారు రైతులకు 55 శాతం, పెద్ద రైతులకు 45 శాతం సబ్సిడీతో ఆటోమేషన్ సదుపాయం కల్పిస్తామన్నారు. జిల్లాలో మొదటిసారి క్రిష్ణగిరి మండలం అమకతాడు గ్రామంలో ఆటోమేషన్ యూనిట్‌ను అమర్చే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఆటోమేషన్ పనితీరు, ప్రోగ్రామింగ్‌పై రైతులకు శిక్షణనిచ్చారు. కొత్త టెక్నాలజీ ద్వారా ఇంట్లో నుంచే చరవాణి ద్వారా ఆపరేట్ చేయవచ్చని ఏపీఎంఐపీ పీడీ తెలిపారు. ఇందువల్ల రైతులకు సమయం ఆదా అవుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ అదనపు పీడీ ఫిరోజ్‌ఖాన్, జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి, డ్రిప్ కంపెనీల ప్రతినిధులు, ఎంఐ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నంద్యాల(వ్యవసాయం): వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఉమ్మడి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. బుధవారం పట్టణంలోని స్పెషల్ సబ్ జైలును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం జైల్లోని పరిసరాలను పరిశీలించి ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సుపై అవగాహన కల్పించారు.


