కర్నూలు(సెంట్రల్): కల్లూరు సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కిరణ్‌కుమార్ ఆదివారం ఉత్వర్వులు ఇచ్చారు. కల్లూరు గ్రామ సర్వే నంబర్ 645ఏ వక్ఫ్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడంతో జిల్లా రిజిస్ట్రార్ బజారితో విచారణ జరిపించినట్లు చెప్పారు. ఆయన నివేదిక మేరకు ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. తదుపరి పూర్తి నివేదికను కోరినట్లు ఆయన వివరించారు. జిల్లాలో ఎవరైనా రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, కల్లూరు ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఈశ్వర్‌ను నియమించినట్లు డీఐజీ తెలిపారు. సోమవారం నుంచి ఆయన బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు.
లోన్ యాప్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు (టౌన్): లోన్ యాప్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమానాస్పద లోన్ యాప్‌లను డౌన్ లోడ్ చేయవద్దని సూచించారు. లోన్ యాప్‌లు డౌన్‌లోడ్ చేసిన తరువాత మొబైల్‌లో ఉన్న కాంటాక్టులు, ఫొటోలు, వ్యక్తిగత సమాచారం వంటి వివరాలను యాక్సెస్ చేసి తరువాత వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. లోన్ యాప్ మోసాలకు గురైన వారు 1930కు కాల్ చేయాలని, లేదంటే స్థానికంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
కర్నూలు(అగ్రికల్చర్): మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, నిధుల వినియోగంపై తనిఖీ చేసేందుకు జిల్లాలో కేంద్రబృందం పర్యటించనుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వివిధ మండలాల్లో ఉపాధి పనుల తనిఖీ, నిధుల వినియోగం తదితర వాటిని పరిశీలించనుంది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్కీమ్ కింద జిల్లా చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేక ఆడిట్ చేసేందుకు ఈ టీమ్ జిల్లాకు వస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి చెందిన స్పెషల్ ఆడిట్ టీమ్ జిల్లాలో మూడు రోజులు పర్యటిస్తుందని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ మాధవీలత తెలిపారు. టీమ్ లీడర్‌గా డిల్లీ స్పెషల్ ఆడిట్ విభాగానికి చెందిన సీనియర్ ఆడిట్ అధికారి(ఏవో) వినిత చౌదరి వ్యవహరించనున్నారు. టీమ్‌లో ఆడిట్ అధికారులు నీరజ్‌కుమార్ యాదవ్, కిరణ్‌మలి సభ్యులుగా ఉంటారు. అప్పటికప్పుడు మండలాలను ఎంపిక చేసుకొని తనిఖీలకు వెళ్లే అవకాశం ఉంది.
రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్
కర్నూలు: నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర, చెడు నడత, సమస్మాత్మక వ్యక్తులను స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లు తరచు సమస్యలు సృష్టించే వ్యక్తులను గుర్తించి స్టేషన్లకు పిలిపించి ఎస్‌హెచ్‌ఓలు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. తరచు గొడవల్లో తలదూర్చే వారిని తీవ్రంగా హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటు గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే తప్పనిసరిగా పోలీస్ చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.


