● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి
కర్నూలు (సెంట్రల్): వలసల నివారణకు చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఏ1 గ్రాండ్ కన్వెన్షన్ హాల్‌లో నీతి అయోగ్ నిర్వహించిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించి ప్రాంతీయ ఉత్తమ పద్ధతుల సెమినార్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెమినార్‌లో ‘గ్రీన్ ఆనియన్ టాప్ లీవ్స్ డీహైడ్రేషన్ యూనిట్’ అనే అంశంపై ప్రెజంటేషన్ ఇచ్చారు. చిప్పగిరి, మద్దికెర, హొళగుంద మండలాల్లో చాలా మంది జీవనోపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారన్నారు. హొళగుంద మండలంలో ఉల్లిపాయకు సంబంధించి గ్రీన్ టాప్ లీవ్స్ డీహైడ్రేషన్ యూనిట్ చిన్నతరహా పరిశ్రమ స్థాపించామన్నారు. ఈ యూనిట్ వ్యవస్థాపకునితో పాటు ఆరుగురికి ప్రత్యేక ఉపాధిని, వంద మందికి పైగా రైతులకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఈ యూనిట్ స్థాపన ఖర్చు దాదాపు రూ.7.4 లక్షలు కాగా యూనిట్ నుంచి నెలకు స్థూల రాబడికి సంబంధించి రూ.2,88,750, నిర్వహణ ఖర్చు నెలకు రూ.2,10,000 నికర లాభం నెలకు రూ.78,750 ఉంటుందన్నారు. ఈ రకమైన యూనిట్లను జిల్లాల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.


