కృష్ణగిరి/కర్నూలు(టౌన్): చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలకు జైలుశిక్షపడింది. వెల్దుర్తి సీఐ యుగంధర్, కృష్ణగిరి ఎస్‌ఐ జి. కృష్ణమూర్తి మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బిజ్నోపూర్ జిల్లాకు చెందిన మహమ్మద్ షహీద్, సుహేబ్‌లు పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. తర్వాత చెడు వ్యసనాలకు అలవాటు పడిన వీరు సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీ మార్గాన్ని ఎంచుకున్నారు. సికింద్రాబాద్‌లో స్థిరపడి వెండి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే రాజస్థాన్‌ను చెందిన ప్రవీణ్ ఆర్ రావల్ వ్యాపార నిమిత్తం గతేడాది అక్టోబర్ 26న హైదరాబాద్ నుంచి రూ. 25 లక్షల నగదుతో బస్సులో గుత్తికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో అమకతాడు టోల్‌ప్లాజా వద్ద డబ్బు సంచిని చూసుకుంటే కనిపించలేదు. వెంటనే సమీపంలోని కృష్ణగిరి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరుసటి రోజు (అక్టోబర్ 27న) కర్నూలు శివారులోని దిన్నెదేవరపాడు గ్రామ సమీపంలో ఉన్న వెంగనబావి దగ్గర అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో చోరీని అంగీకరించడంతో రిమాండ్‌కు పంపారు. మంగళవారం ఆ ఇద్దరు దొంగలకు డోన్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్. జ్యోతి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ముద్దాయిలకు శిక్ష పడడంలో కీలకంగా వ్యవహరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ భాస్కర్‌రావు, పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.


