ఆదోని రూరల్: దీపం పథకం కింద ప్రజలకు అందించే డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని సబ్‌కలెక్టర్ అజయ్‌కుమార్ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి సబ్‌కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు 4 బృందాలుగా ఏర్పడి హోటళ్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 15 హోటళ్లకు సంబంధించిన వారు 34 డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత హోటల్ యజమానులపై నిత్యావసర సరుకుల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ.. గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపార అవసరాల కోసం వినియోగించడం చట్ట విరుద్ధమన్నారు. అలాగే హోటల్‌లో ఆహార పదార్థాల్లో నాణ్యత లోపించినా సహించబోనని హెచ్చరించారు.


