కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఒకప్పుడు కేవలం దంత వైద్యచికిత్సలు నామమాత్రంగా ఉండేవి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రోత్సాహం కారణంగా ఇక్కడి దంత వైద్యసేవలు మరింత మెరుగయ్యాయి. నాలుగేళ్ల దంత విభాగంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేశారు. ఇందులో భాగంగా ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. ప్రస్తుతం ఒక ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉంది. వీరిలో పెరియో డెంటిస్ట్, ఎండో డెంటిస్ట్, ఆర్థో డెంటిస్ట్, ఓరల్ సర్జన్ ఉన్నారు. ఈ విభాగంలో పెద్దలతో పాటు చిన్నపిల్లలకూ దంత చికిత్సను అందిస్తున్నారు. పిప్పి పళ్లను సరిచేయడం, తీసేయడం, ఎముక కట్ చేయడం, స్కేలింగ్ చేయడం, చిగుళ్ల వాపులు, రక్తం కారడంపై చికిత్స చేస్తున్నారు. రెండేళ్ల క్రితం రూ.8 లక్షలతో ఓపీజీ మిషన్(ఎక్స్‌రే), రూ.8 లక్షలతో క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మిషన్ (వెల్‌స్కోప్) కొనుగోలు చేశారు. గత ప్రభుత్వంలోనే మూడు ఆధునిక దంత వైద్యచికిత్స చైర్లు వచ్చాయి.


