కుమారుడికి తండ్రి పునర్జన్మ | - | Sakshi
Sakshi News home page

కుమారుడికి తండ్రి పునర్జన్మ

Mar 7 2026 7:27 AM | Updated on Mar 7 2026 7:27 AM

కిడ్నీ దానం చేసిన తండ్రి

రక్తం గ్రూపు వేరైనా ఆపరేషన్‌

విజయవంతం

కర్నూలు(హాస్పిటల్‌): ఆ తండ్రి 28 ఏళ్ల క్రితం కుమారునికి జన్మనిచ్చాడు. తిరిగి ఇన్నాళ్లకు మళ్లీ పునర్జన్మనిచ్చాడు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న కుమారునికి రక్తం గ్రూపు సరిపోకపోయినా తన కిడ్నీని దానం చేసి ప్రాణం దక్కించుకున్నాడు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు గ్రామానికి చెందిన మధుకృష్ణ(28) కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం గత సంవత్సరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అతనికి కిడ్నీ వైఫల్యం ఉన్నట్లు నిర్ధారించారు. అతనికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ ఒక్కటే పరిష్కారమని తేల్చారు. అతనిది ఏ పాజిటివ్‌ రక్తం గ్రూపు కాగా కిడ్నీ దానం చేయడానికి వచ్చిన తండ్రి గోరంట్ల రక్తగ్రూపు ఏబీ పాజిటివ్‌ కావడంతో రక్తగ్రూపు సరిపోలేదు. దీంతో కర్నూలు, హైదరాబాద్‌ ప్రాంతాల్లోని పలు ఆసుపత్రులను సంప్రదించినా కిడ్నీ మార్పిడి సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల కర్నూలులోని కిమ్స్‌ హాస్పిటల్‌కు వెళ్లి నెఫ్రాలజిస్టు డాక్టర్‌ కె.అనంతరావును సంప్రదించారు. రోగిని పూర్తిగా పరిశీలించిన అనంతరం ఏబీఓ ఇన్‌కంపాటిబుల్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయవచ్చని డాక్టర్‌ అనంతరావు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక వైద్య పద్ధతులు అనుసరించి గత నెల 13వ తేదీన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను ఆయన విజయవంతంగా నిర్వహించారు. రోగి కోలుకోవడంతో 21వ తేదీన డిశ్చార్జ్‌ చేశారు. శుక్రవారం ఈ చికిత్సకు సంబంధించి డాక్టర్‌ అనంతరావు మాట్లాడుతూ రక్తగ్రూపు సరిపోని పరిస్థితుల్లో కిడ్నీమార్పిడి చేయడం సాంకేతికంగా చాలా క్లిష్టమైన ప్రక్రియ అని, ఇందుకోసం ముందుగా రోగి శరీరంలో ఉన్న యాంటిబాడీలను తగ్గించే ప్రత్యేక చికిత్స(డీసెన్సిటైజేషన్‌) చేయాల్సి ఉంటుందన్నారు. ఇన్‌ఫెక్షన్లను నివారించేందుకు వ్యాక్సిన్‌లు ఇవ్వడంతో పాటు కొత్త యాంటిబాడీలు ఏర్పడకుండా ఉండేందుకు రిటుక్సిమాబ్‌ అనే ఇంజెక్షన్‌ ఇస్తారన్నారు. శరీరంలో ఉన్న యాంటిబాడీలను తొలగించేందుకు ప్లాస్మా ఎక్సేంజ్‌ వంటి ప్రక్రియలు నిర్వహిస్తారని తెలిపారు. యాంటిబాడీ స్థాయి 1ః4 కంటే తక్కువ వచ్చిన తర్వాతే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేపడతామని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement