● ప్రభుత్వాన్ని హెచ్చరించిన
గ్రామ సర్వేయర్లు
కర్నూలు(సెంట్రల్): గ్రామ సర్వేయర్ల డిమాండ్లను పరిష్కరించకపోతే రీసర్వేను నిలిపివేస్తామని ఏపీ విలేజ్ సర్వేయర్ల సంఘం రాష్ట్ర ట్రెజరర్ ఓంకార్ హెచ్చరించారు. జిల్లాలో పనిచేస్తున్న విలేజ్ సర్వేయర్లు శుక్రవారం నగరంలోని సర్వే ఏడీ కార్యాలయానికి చేరుకుని తమ డిమాండ్లపై వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారికంగా శనివారం నుంచి విలేజ్ సర్వేయర్ల వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలగనున్నట్లు చెప్పారు. సోమవారం విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న విలేజ్ సర్వేయర్లకు గ్రేడ్–1 పదోన్నతితోపాటు పే స్కేలును కనీసం రూ.34,580 బేసిక్‌గా పెట్టాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ సర్వేయర్ గ్రేడు–1కి మండల డిప్యూటీ సర్వేయర్‌కి మధ్యన స్పెషల్ సర్వేయర్ పోస్టు సాంకేతిక విభాగ సమాన పేరోల్ కనీ సం రూ.37,640 బేసిక్ అమలు చేయాలని చేస్తున్న డిమాండ్‌ను తోసిపుచ్చడం అన్యాయమన్నారు. అడహక్ పద్ధతిలో మండల డిప్యూటీ సర్వేయర్ పదోన్నతి కల్పిస్తే రీసర్వేలో ప్రధాన భూమికను పోషిస్తామన్నారు. గ్రామ సర్వేయర్ కనీస విద్యార్హత డిప్లొమాగా సవరించాలని, రీసర్వేలో క్యూజీఐఎస్, సీఓఆర్‌ఎస్, ఆటో సీఏడీ వంటి సాంకేతిక నైపుణ్యాలు ఉన్న గ్రామ సర్వేయర్లను టెక్నికల్ రోల్ కింద గుర్తించి ప్రత్యేక పేస్కేలు అమలు చేయాలన్నారు. ఐదేళ్లుగా విలేజ్ సర్వేయర్ పోస్టులకు స్పెషల్ గ్రేడు సర్వేయర్స్, గ్రేడు–2 నుంచి గ్రేడు–1 సర్వేయర్ పదోన్నతులు రావడం లేదన్నారు. ఇలా ఎందుకు జరుగుతోందో ఎవరూ చెప్పకపోవడంతో రీ సర్వేను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సర్వే ఏడీ మురళీకృష్ణకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో గోపాలకృష్ణ, మనోజ్‌కుమార్, వీ.రఘుదీప్, వంశీ, మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.


