హొళగుంద: ‘మీకు మొదటి కాన్పు కింద రూ.6 వేలు వచ్చాయి’ అని సైబర్ నేరగాడు ఆశ పెట్టి బాధితుడి నుంచి రూ. 19 వేలు కాజేశాడు. ఈ సంఘటన శుక్రవారం హొళగుందలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ముల్లా షాకీర్ అనే యువకుడికి శుక్రవారం సాయంత్రం 917289982513 నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘అంగన్‌వాడీ, హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి మాట్లాడుతున్నామంటూ ‘ప్రభుత్వం మీకు మొదటి కాన్పు కింద రూ.6 వేలు అందిస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్, ఫోన్ పే నంబరు తదితర వివరాలు ఇవ్వాలి.’ అంటూ నమ్మబలికాడు. సైబర్ నేరాలపై అంతగా అవగాహన లేని షాకీర్ రూ.6 వేలు వస్తాయి అనే అశతో వివరాలన్నీ ఇచ్చేశాడు. అయితే జీరో అకౌంట్ అని రూ.6 వేలు పడాలంటే మరో బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలని నమ్మబలికాడు. ఆన్‌లైన్‌లోనే ఖాతా తెరుస్తానని చెప్పి ఫినో పేమెంట్స్ బ్యాంక్ పేరిట కొత్త ఖాతా తెరిచి ఖాతాలో ముందుగా రూ.10 వే లు, ఆ తర్వాత రూ.5 వేలు, రూ.4 వేలు చొప్పున నగదు వేసుకోండని చెప్పాడు. అమాయకుడైన షాకీర్ తన అకౌంట్లోనే ఉంటాయి కదా అని సదరు కేటుగాడు మాటలు నమ్మించి ఫోన్ పే నంబరుకు పది నిమిషాల్లో ఆ మొత్తం నగదు వేశాడు. విషయాన్ని తెలిసిన వాళ్ల దగ్గర చెప్పడంతో వారు వెంటనే ఫోన్ చేసిన వ్యక్తికి తిరిగి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో సైబర్ నేరగాళ్ల పనేనంటూ బాధితుడు హొళగుంద పోలీసులను ఆశ్రయించాడు.


