నటి షామ్నా ఖాసిం అలియాస్ పూర్ణ రెండోసారి తల్లయింది. గతేడాది ఆగస్టులో గర్భం దాల్చిన ఆమె మార్చి 14న ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దేవుడి ఆశీస్సులతో ఈరోజు ఉదయం 4 గంటల 25 నిమిషాలకు పాప పుట్టింది. తను మాకు లభించిన అపురూపమైన కానుక.
సాఫీగా డెలివరీ
ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా డెలివరీ అయినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆస్పత్రి బృందానికి కూడా ధన్యవాదాలు అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు పూర్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా పూర్ణ 2022లో వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది. ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా 2023లో బాబు పుట్టాడు.
సినిమా
పూర్ణ మలయాళ నటి. సీమటపాకాయ్, అవును సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. శ్రీ మహాలక్ష్మి, నువ్వలా నేనిలా, రాజుగారి గది, అఖండ 2 ఇలా పలు చిత్రాల్లో నటించింది. మహేశ్‌బాబు గుంటూరు కారం సినిమాలో 'కుర్చీ మడతపెట్టి..' పాట ప్రారంభంలో కనిపిస్తుంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ మూవీస్ చేసింది.


