● స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీకి విన్నవించిన క్రెడాయ్
కర్నూలు(సెంట్రల్): ప్లాట్లు, ఇళ్లు, స్థలాల కొనుగోలు సమయంలో సబ్ రిజిస్ట్రార్లు వ్యక్తం చేసే చిన్న చిన్న సందేహాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అవుతోందని, వాటికి సరైన పరిష్కారం చూపాలని క్రెడాయ్ చైర్మన్ గోరంట్ల కోరారు. మంగళవారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కిరణ్‌కుమార్, జిల్లా రిజిస్ట్రార్ బజారిని వారి కార్యాలయాల్లో క్రెడాయ్ ప్రతినిధులు కలసి సందేహాల నివృత్తి కోసం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే నంబర్లు, సబ్ డివిజన్లపై వ్యక్తమవుతున్న సందేహాలతో కొనుగోలు దారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈసీలు రావడానికి ఎక్కువ సమయం పడుతోందని, దరఖాస్తు చేసిన వెంటనే ఇచ్చేలా చూడాలని కోరారు. ఈసీల్లోని చిన్న చిన్న తప్పులు వెంటనే సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేఅవుట్ విధానంలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు జే.సురేష్‌కుమార్‌రెడ్డి, పి.గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.


