కేజీబీవీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడులైంది. ఇందులో ప్రత్యేకంగా బాలికలు చదువుకోవడం గొప్ప అవకాశంగా చెప్పాలి. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత చదువు, వసతి కల్పిస్తూ ప్రభుత్వం నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందిస్తుంది. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని పేద బాలికలు సద్వినియోగం చేసుకోవాలి.
– చైతన్య స్రవంతి, ప్రిన్సిపాల్, కేజీబీవీ కృష్ణగిరి
కృష్ణగిరి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)ల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026–27 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు గడువు ఉంది. అర్హులైన బాలికలు 6వ తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను పరిశీలించి ఏప్రిల్ 14న ఎంపిక జాబితా ప్రచురించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 52 కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో 6వ తరగతికి 40 సీట్లు, ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించి 40 సీట్ల చొప్పున మొత్తం 4,160 సీట్లను ఈ ఏడాది భర్తీ చేయనున్నారు. ఇంటర్‌కు సంబంధించి కొన్ని విద్యాలయాల్లో బైపీసీ, మరి కొన్నింటిలో ఎంపీసీ గ్రూపుల్లో ప్రవేశాలు ఉన్నాయి. పేద, అనాథ పిల్లలతో పాటు బడి బయట ఉన్న పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసినవారు), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) జీవిస్తున్న బాలికలు, దివ్యాంగులకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ముందుగా స్థానిక మండలంలో ఉన్న వారికి అవకాశం కల్పించగా, మిగిలిన సీట్లను పక్క మండలం వారికి కేటాయిస్తారు. 6వ తరగతిలో ప్రవేశం కోసం ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదివిన బాలికలై ఉండాలి. అలాగే ఇంటర్ ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏప్రిల్ 1వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
రిజర్వేషన్ల అమలు ఇలా..
గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షల వార్షిక ఆదాయం పొందే వారు అర్హులు. అలాగే రిజర్వేషన్ అమలులో భాగంగా మొత్తం 40 సీట్లలో 15 సీట్లు ఓపెన్ కాంపిటేషన్ (ఓసీ) కింద, 5 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు, ఇతర వెనుకబడిన తరగతులు(బీసీ)లకు 10 సీట్లు కేటాయిస్తారు. మిగిలిన సీట్లలో రిజర్వేషన్ల ప్రకారం సీట్ల విభజనను పూర్తి చేస్తారు.
మెరుగైన ఫలితాలు..
కేజీబీవీలు 2004లో ప్రారంభమయ్యాయి. అన్ని వసతులు, సదుపాయాలతో కూడిన ఉచిత విద్యను అందిస్తూ ఏటా కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే విధంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. 2021 నుంచి అన్ని చోట్ల ఇంటర్మీడియెట్ కోర్సులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. కృష్ణగిరి కేజీబీవీ ప్రారంభం నుంచి పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తూ మంచి గుర్తింపు పొందింది. ఇక్కడ సీటు పొందేందుకు తీవ్రంగా పోటీ ఉంటుంది. ప్రతేడాది 40 సీట్లకు వంద మందికిపైగా విద్యార్థినులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారంటే పోటీ ఏవిధంగా ఉందో ఇట్లే అర్థమవుతుంది.
ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్
ప్రవేశాలకు అవకాశం
ఈ నెల 12 నుంచి
దరఖాస్తుల స్వీకరణ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
52 కేజీబీవీల్లో
4,160 సీట్ల భర్తీకి చర్యలు


