కోడుమూరు రూరల్: గోరంట్ల గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ, భూదేవి మాధవస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన కల్యాణం, గరుడోత్సవ సేవకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల కల్యాణానికి శ్రీమాధవస్వామి తరఫున ఎర్రగుడి వాసులు, అమ్మవార్ల తరఫున గోరంట్ల వాసులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించగా, ఆలయ పండితులు ఆగమ శాస్త్రప్రకారం కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని తిలకించేందుకు స్థానిక భక్తులతో పాటు జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది తరలివచ్చారు. స్వామి కల్యాణం సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది. కార్యక్రమంలో ఈఓ గుర్రెడ్డి, వేద పండితులు వందవాసి రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, రమణమూర్తి, హరి, వెంకట్రామయ్య, పద్మానాభ ఆచారి, రాజేష్, కర్ణం లక్ష్మీనారాయణ, ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
వైభవంగా గరుడోత్సవం..
కల్యాణంతరం ఉత్సవమూర్తులైన స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఉంచి మేళతాళాల మధ్య గ్రామ పురవీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. గరుడ వాహనానికి ముందు ఎర్రగుడి వాసులు, వెనుక గోరంట్ల వాసులు నిలబడి పోటా పోటీగా లాగుతూ గరుడోత్సవాన్ని ఎంతో అట్టహాసంగా కోలాహలంగా నిర్వహించారు. కోడుమూరు ఎస్‌ఐ ఎర్రిస్వామి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.


