● పోగొట్టుకున్న బంగారు బ్రేస్‌లెట్
ప్రయాణికుడికి అప్పగింత
కోవెలకుంట్ల: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ బంగారు బ్రేస్‌లెట్ జారవిరుచుకున్న ప్రయాణికుడు ఆర్టీసీ బస్ కండక్టర్ నిజాయితీతో తిరిగి పొందాడు. కోవెలకుంట్లకు చెందిన ప్రసన్నకుమార్ హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున 5.10 గంటలకు కర్నూలులో కోవెలకుంట్లకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కాడు. బస్సు బనగానపల్లెకు చేరుకోగా సొంత పని ఉండటంతో అక్కడే దిగాడు. బస్సు కోవెలకుంట్లకు చేరుకున్న తర్వాత ఒక ట్రిప్పు అమడాలకు, మరో సింగల్ బనగానపల్లెకు వెళ్లింది. అయితే బస్ వెళ్లిపోయిన రెండు గంటలకు చేతికి బ్రేస్‌లెట్ కన్పించకపోవడంతో బస్సులో పడిపోయి ఉండవచ్చని భావించి కోవెలకుంట్లలో ఉన్న తన స్నేహితుడు రవితేజకు ఫోన్ చేసి చెప్పాడు. రవితేజ తండ్రి శివరాం స్థానిక ఆర్టీసీ డిపోలో క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. కుమారుడి ద్వారా విషయం తెలుసుకున్న ఆయన కర్నూలు నుంచి బయలుదేరిన బస్సు వివరాలు తెలుసుకుని ఆ బస్సు కండక్టర్ ఈవీ రమణను ఫోన్ చేశాడు. బస్‌లో బ్రేస్‌లెట్ పడిపోయిందని వెనుక నుంచి మూడవ సీటు వద్ద పరిశీలించాలని సూచించాడు. కండక్టర్ సీటు వద్దకు వెళ్లి చూడగా సీటు మధ్యలో కన్పించింది. కండక్టర్ ఏ మాత్రం ఆలోచించకుండా బ్రేస్‌లెట్ దొరికినట్లు సమాచారం ఇచ్చాడు. రెండున్నర తులాల బంగారు బ్రేస్‌లెట్ పోగొట్టుకున్న ప్రయాణికుడిని పిలిపించి డిపో మేనేజర్ నాగరాజు సమక్షంలో అందజేశారు. నిజాయితీ చాటిన కండక్టర్ ఈవీ రమణను డీఎంతోపాటు సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.


