పేరుకు పెద్దాసుపత్రి. చుట్టుపక్క జిల్లాలకూ పెద్దదిక్కు. వందలాది మంది ఉద్యోగులు.. వేలాది మంది రోగులు. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్నా.. కనీస పర్యవేక్షణ లోపించింది. కళ్లెదుటే రోగులు ఇబ్బందులు పడుతున్నా.. ఏ ఒక్కరిలోనూ మానవత్వం కనిపించని పరిస్థితి. ఇక్కడ జరిగేదంతా మామూలే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో రోగులు, సహాయకులకు నిత్య నరకం తప్పడం లేదు. రోగులకు ఎలాంటి అవసరమొచ్చినా, సహాయకులే దగ్గరుండి చూసుకోవాల్సిన దుస్థితి. రక్త పరీక్షలు, స్కానింగ్‌లు.. ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లాలంటే స్ట్రెచ్చర్‌ను కుటుంబ సభ్యులే తోసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితులు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రి సిబ్బంది ఓ చేయి వేయాలంటే ఆ చేతిని తడిపితేనే స్ట్రెచ్చర్ కదులుతుంది. ఈ ‘పైసా’చికం ఆసుపత్రి అధికారులకు తెలియనిది కాదు, అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం రోగులకు శాపంగా మారుతోంది.
– డి.హుస్సేన్,
సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు


