నంద్యాల: పట్టణ శివారులో కర్నూలు బైపాస్ రహదారిలో కుందూనది వంతెన కింద శనివారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నంద్యాల త్రీటౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం కుందూనది బ్రిడ్జి కింద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. మృతుడు పట్టణంలోని నూనెపల్లెలోని మంచినీళ్ల బావి వీధికి చెందిన పెయింటర్ హారిఫ్ (38)గా గుర్తించారు. మృతుడికి భార్య హమీద, కొడుకు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి తనతో ఘర్షణ జరిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదని మృతుడు భార్య చెబుతుండగా.. తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదని, ఎవరో వ్యక్తులు దాడి చేసి చంపేశారని మృతుడి సోదరి ఆరోపిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించామని, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.


