● సాక్షి కథనానికి స్పందించిన
ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు
కొత్తపల్లి: దుర్భర జీవితాన్ని గడుపుతున్న పాతమాడుగుల గూడెం చెంచు గిరిజనులకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సభ్యులు సోమవారం నిత్యావసర సరుకులు అందజేశారు. గత నెల 27వ తేదీన సాక్షిలో ‘గూడెం కడుపు మాడుతోంది’ అనే శీర్షికన కథనం వెలువడింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సభ్యులు విషయం తెలుసుకుని గిరిజనులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షు డు ఈదురు పద్మాకర్ సోమవారం మండలంలోని పాతమాడుగుల గూడెం సందర్శించి గిరిజనులకు నిత్యావసర సహాయం అందించారు. ఆహార పదార్థాలు, దుస్తులు, టవళ్లు, దుప్పట్లు, చిన్నపిల్లకు దుస్తులు, బ్యాగులు, తదితర అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల జీవనోపాధిని మెరుగు పర్చడమే మానవ హక్కుల పరిరక్షణలో భాగమన్నారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యుడు నారాయణరెడ్డి, జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ రోషన్న (రిటైడ్ డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్), ఎన్‌హెచ్‌ఆర్‌సీ సంస్థ సభ్యులు లేబర్ యూనియన్ లీడర్ అడివప్ప, హర్ష గీత, గంగాధర్ శెట్టి, ఎర్రమఠం పీహెచ్‌సీ హెల్త్ వర్కర్ శాంతమ్మ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


