ఉయ్యాలవాడ: మండలంలోని అల్లూరు గ్రామంలో ట్రాన్స్ జెండర్ లక్ష్మి(41) అలియాస్ నరసింహుడు ఆత్మహత్యకు పాల్పడిన ట్లు ఏఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. లక్ష్మి గత కొంత కాలంగా కిడ్ని వ్యాధితో బాధపడుతూ ఉందన్నారు. పలు వైద్యశాలల్లో చికిత్సలు పొందిన ఫలితం లేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందజేశారు. లక్ష్మి అన్న పెద్ద నరసింహుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
వడదెబ్బతో వలస కూలీ మృతి
కృష్ణగిరి: బతుకు దెరువు కోసం వెళ్లిన ఓ వలస కూలీ వడదెబ్బతో మృతి చెందాడు. లక్కసాగరం గ్రామానికి చెందిన మాల దాసరి పద్మనాభం(59), అనంతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి గ్రామంలో కూలీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో కూలీ పనులు లేకపోవడంతోపాటు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించకపోవడంతో వారం రోజుల క్రితం దంపతులు గ్రామంలో మరి కొంత మంది గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రోంటిపాలెం గ్రామంలో మిరప పనులకు వెళ్లారు. శుక్రవారం పనుల్లో ఉండగా పద్మనాభం వడదెబ్బతో మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
యువకుడి మృతి
కోడుమూరు రూరల్: బావిలో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కోడుమూరులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కోడుమూరుకు చెందిన కెంచుగుండు నాగార్జున అనే వ్యక్తి గత పదినెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. అతని భార్య సుశీల, కుమారుడు వీరేష్ (25) జీవనం సాగిస్తున్నారు. అయితే ఏమి జరిగిందో తెలియదుగాని వీరేష్ గురువారం మధ్యాహ్నం తల్లికి ‘ఐ మిస్ యూ’ అమ్మ అంటూ మెసేజ్ పెట్టి కన్పించకుండా పోయాడు. శుక్రవారం పట్టణ సమీపంలోని నరసప్ప బావిలో శవమై తేలా డు. అయితే వీరేష్ మృతికి కారణాలు తెలియ రాలేదు. తల్లి సుశీల ఫిర్యాదు మేరకు కోడుమూరు ఎస్‌ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గడ్డివాములు దగ్ధం
హొళగుంద: మండల కేంద్రంలోని పీహెచ్‌సీ సమీపంలో పాలబావి వద్ద శుక్రవారం రాత్రి రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన గౌరమ్మ, బోయ రామచంద్ర అనే రైతులు జొన్నసొప్ప, వరిగడ్డిని కొని నిల్వ చేసుకున్నారు. అయితే శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని మంటలు ఎగిశాయి. స్థానికులు ఆలూరు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా, ఫైరింజన్ చేరుకునేలోపు గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. లక్షన్నర ఆస్తినష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
డోన్ టౌన్: ఈ నెల 9వ తేదీ డోన్ మండలంలోని కొత్తకోట గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. బహిరంగ సభలో సీఎం పాల్గొని రైతులకు కొత్త పట్టాదార్ పాస్ బుక్‌లు అందజేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కార్తీక్, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్, డీఎస్పీ శ్రీనివాస్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. హెలిపాడ్, సభా ప్రాంగణం పరిశీలిస్తూ అధికారులకు సూచనలు చేశారు. వారి వెంట ఆర్డీఓ నరసింహులు, తహసీల్దార్లు రవికుమార్, నాగమణి, ఎంపిడీఓ వెంకటేశ్వరరెడ్డి, సీఐ రాకేష్‌తో ఉన్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో
ఆటో గ్యారేజ్ దగ్ధం
శ్రీశైలం ప్రాజెక్ట్: రింగ్ పార్క్ సెంటర్‌లో ఉన్న సాయిరాం ఆటో గ్యారేజ్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ కావడంతో మల్లికార్జునకు చెందిన గ్యారేజీలో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. అయినప్పటికీ సుమారు రూ.2.5 లక్షల మేరకు నష్టం వాటిల్లి ఉంటుందని ఫైర్ ఆఫీసర్ బి వెంకటేశ్వర్లు తెలిపారు.


