కర్నూలు(సెంట్రల్): కల్లూరు మండలం బస్తిపాడులో కొందరు టీడీపీ నాయకులు కొండలు, గుట్టలను అక్రమంగా తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారని, వారి దందాకు అడ్డుకట్ట వేయాలని జిల్లా కలెక్టర్‌ను వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి కోరారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ.. అనుమతులు ఒక ప్రాంతంలో తీసుకొని పొలం చదును పేరుతో విధ్వంసం చేస్తున్నారన్నారు. గ్రావెల్ తవ్వి తీసుకెళ్తున్నా మైనింగ్ అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. రాత్రికి రాత్రే కొండలు, గుట్టలు నామరూపాలు లేకుండాపోతున్నాయన్నారు. ఫలితంగా పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
ఇసుక అక్రమ రవాణా..
రాజ్యాంగేతర శక్తిగా ఉల్లిందకొండ ఎస్‌ఐ మారారని కాటసాని ఆరోపించారు. హంద్రీ వెంట ఇసుకను తీసుకెళ్లే ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీసు స్టేషన్‌లో ఉంచుకుంటున్నారని, అయితే అందులో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల ట్రాక్టర్లనే సీజ్ చేస్తున్నారన్నారు. టీడీపీ వారికి సంబంధించిన వాహనాలను కనీసం పట్టుకోవడంలేదన్నారు. ఫలితంగా నిజంగా ఇసుక అవసరం ఉన్న వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా సాగుతోందని, ప్రజలు ఇసుక కొనుగోలు చేసేలా ఎస్‌ఐ వ్యవహరిస్తుండడం దారుణమన్నారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారి 44పై ఉన్న సర్వీసు రోడ్డును కొందరు ఆక్రమించుకున్నారని, తద్వారా వాహనాలు వెళ్లడానికి ఇబ్బందిగా మారిందన్నారు. ఈ క్రమంలో రోడ్డులో వెళ్తుండడంతో అధిక స్పీడుతో వాహనాలు ప్రమాదాల బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, తక్షణమే సర్వీసు రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. లక్ష్మీపురం కౌన్సిలర్ నారాయణరెడ్డి, రాజేష్, పాండు, లక్ష్మీరావు, షేక్ పాల్గొన్నారు.
లేదంటే పర్యావరణానికి
ముప్పు వస్తుంది
ఉలిందకొండ ఎస్‌ఐపై
చర్యలు తీసుకోవాలి
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి


