భక్తజనం మధ్య రథోత్సవం
● రమణీయం ఉగ్రనరసింహుడి రథోత్సవం
ఆళ్లగడ్డ: భక్తుల గోవింద నామస్మరణలు.. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలు.. డప్పుల వాయిద్యాల మధ్య శ్రీ జ్వాలా నృసింహస్వామి రథోత్సవం ఎగువ అహోబిలంలో నేత్ర పర్వంగా కొనసాగింది. అహోబిలేశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో రోజైన సోమవారం ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీజ్వాలా నృసింహస్వామి రథోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. భక్తులు భక్తి పారవశ్యంతో రథం లాగారు. ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల మధ్య పల్లకీలో కొలువుంచి దేవాలయం బయట ఉన్న రథం వరకు తోడ్కొని వచ్చారు. అప్పటికే వివిధ పుష్పాలతో నేత్రానందపర్వంగా ముస్తాబు చేసిన రథంపై అహోబిలేశుడు దేవదేవేరులతో అధిష్టించారు. పండితులు రథాంగ పూజలు నిర్వహించిన అనంతరం కొబ్బరికాయలు సమర్పించి, హారతిచ్చి, రథోత్సవాన్ని ప్రారంభించారు. దేవస్థాన మాడ వీధుల్లో రథోత్సవం కనుల పండువగా సాగింది.
ఉభయ దేవేరులతో రథంలో కొలువైన శ్రీజ్వాలా నృసింహస్వామి


